తిరుపతిలోని ఓ వ్యాపారికి పాకిస్థాన్ దేశ కోడ్‌తో వచ్చిన ఫోన్‌కాల్ తీవ్ర భయాందోళనకు దారి తీసింది. కుటుంబ సభ్యుల వివరాలు ప్రస్తావిస్తూ, ఇంటిపై బాంబు వేసి పేల్చేస్తామంటూ అజ్ఞాత వ్యక్తి బెదిరించడంతో నగరవాసుల్లో కలకలం రేగింది.
పగడాల త్రిలోక్ కుమార్, స్థానికంగా గాజుల వ్యాపారం నిర్వహిస్తున్న వ్యాపారవేత్త. బుధవారం ఉదయం ద్విచక్రవాహనంపై తిరుమల కొండకు వెళ్తున్న సమయంలో, +92 32925 27504 అనే పాకిస్థాన్ దేశం కోడ్ ఉన్న నంబర్ నుంచి ఫోన్ కాల్ వచ్చింది. ఫోన్‌లో మాట్లాడిన వ్యక్తి తాను పాకిస్థాన్‌కు చెందిన అధికారినని పరిచయం చేసుకున్నట్లు సమాచారం.
ఫోన్‌లో ఆగంతకుడు త్రిలోక్ కుమార్ కుటుంబ సభ్యుల పేర్లను ప్రస్తావిస్తూ, "మీరు ఏం చేస్తున్నారో మాకు తెలుసు. జాగ్రత్తగా ఉండకపోతే మీ ఇంటిపై బాంబు వేసి పేల్చేస్తాం" అని తీవ్ర హెచ్చరికలు జారీ చేశాడు. ఈ అనూహ్య బెదిరింపుతో ఒక్కసారిగా భయంతో హడలిపోయిన త్రిలోక్ వెంటనే డయల్ 100కు ఫోన్ చేసి పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఈ ఘటనపై స్పందించిన తిరుపతి క్రైమ్ బ్రాంచ్ సీఐ రామ్‌కిషోర్ మాట్లాడుతూ, "ప్రాథమికంగా ఇది పాకిస్థాన్ నుంచి వచ్చిన బెదిరింపు కాల్‌గానే కనిపిస్తోంది. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశాము. అన్ని కోణాల్లో దర్యాప్తు కొనసాగుతోంది. పూర్తి స్థాయి విచారణ అనంతరం నిజానిజాలు వెల్లడిస్తాం," అని తెలిపారు.
ప్రస్తుతం పోలీసులు కాల్ డేటా, టెక్నికల్ అనాలిసిస్ ఆధారంగా దర్యాప్తు ముమ్మరం చేశారు. ఈ ఘటనతో తిరుపతి నగరవాసుల్లో భద్రతపై ఆందోళన వ్యక్తమవుతోంది. పోలీసులు జాగ్రత్తగా ఉండాలని ప్రజలకు సూచిస్తూ, అనుమానాస్పద కాల్స్ వచ్చినపుడు తక్షణమే అధికారికంగా సమాచారం ఇవ్వాలని సూచిస్తున్నారు.