ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రం తిరుమలలో సాధారణంగా రోజూ 50 వేల నుంచి లక్ష మంది భక్తులు శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకుంటారు. దీనివల్ల భక్తులు ఎక్కువ సమయం క్యూల్లో వేచి ఉండాల్సి వస్తుంది. అయితే, నేడు వర్షాల కారణంగా భక్తుల రద్దీ తగ్గింది.
ప్రస్తుతం శ్రీవారి దర్శనం కోసం కేవలం మూడు కంపార్ట్‌మెంట్లలోనే భక్తులు వేచి ఉన్నారు. స్వామివారి దర్శనం 4 గంటల్లో పూర్తవుతోంది. రూ. 300 ప్రత్యేక దర్శనానికి 2 నుంచి 3 గంటల సమయం పడుతోందని ఆలయ అధికారులు తెలిపారు.
మరోవైపు, నిన్న 82,628 మంది భక్తులు స్వామివారి దర్శనం చేసుకున్నారు. 30,505 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. స్వామివారి హుండీ ఆదాయం రూ. 3.73 కోట్లు వచ్చినట్టు అధికారులు వెల్లడించారు.