కృష్ణా, గోదావరి ఉగ్రరూపం – ధవళేశ్వరం వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక కొనసాగుతుంది
ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా కృష్ణా, గోదావరి నదులు ఉద్ధృతంగా ప్రవహిస్తున్నాయి. దాదాపు 15 లక్షల క్యూసెక్కుల వరద నీరు సముద్రంలో కలుస్తోంది. ఇందులో కృష్ణానది నుంచి దాదాపు 5 లక్షల క్యూసెక్కులు, గోదావరి నుంచి సుమారు 10 లక్షల క్యూసెక్కులు సముద్రంలోకి చేరుతున్నాయి.
విజయవాడ ప్రకాశం బ్యారేజీ వద్ద ప్రస్తుతం ఇన్‌ఫ్లో 5,05,976 క్యూసెక్కులు నమోదు కాగా, అంతే మొత్తాన్ని అధికారులు సముద్రంలోకి విడుదల చేస్తున్నారు.
ఇక గోదావరి నది ఉగ్రరూపం దాల్చింది. భద్రాచలం వద్ద నీటి మట్టం బుధవారం రాత్రి 48 అడుగులుగా ఉండగా, గురువారం ఉదయానికి అది 50.8 అడుగులకు పెరిగింది. వరద నీరు ప్రధాన రహదారులపైకి చేరడంతో పలు మండలాల్లో గ్రామాల రాకపోకలు నిలిచిపోయాయి. భద్రాచలం కల్యాణ కట్ట వరకు వరద నీరు చేరింది. స్నానఘట్టాల మెట్లు, విద్యుత్ స్తంభాలు నీటిలో మునిగిపోయాయి.
ధవళేశ్వరం ప్రాజెక్టు వద్ద ఇన్‌ఫ్లో 9,84,339 క్యూసెక్కులు ఉండగా, అదే మొత్తాన్ని దిగువకు విడుదల చేస్తున్నారు. ఆనకట్ట వద్ద 11.9 అడుగుల నీటి మట్టం నమోదు అయ్యింది. దీంతో మొదటి ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది.
విపత్తు నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ మాట్లాడుతూ, అల్లూరి సీతారామరాజు, తూర్పు గోదావరి, కాకినాడ, ఏలూరు, పశ్చిమ గోదావరి జిల్లాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. నదీ పరీవాహక ప్రాంత ప్రజలు తప్పనిసరిగా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.