పొరుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, కర్ణాటక చేపడుతున్న రెండు కీలక ప్రాజెక్టులపై న్యాయపోరాటానికి తెలంగాణ ప్రభుత్వం సిద్ధమైంది. ఏపీ చేపడుతున్న పోలవరం–బనకచర్ల అనుసంధానం, కర్ణాటక చేపడుతున్న ఆల్మట్టి ఎత్తు పెంపును అడ్డుకునేందుకు సుప్రీంకోర్టును ఆశ్రయించాలని నిర్ణయించింది. ఈ రెండు అంశాలపై వేర్వేరుగా న్యాయపరమైన చర్యలు చేపట్టేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు.
కర్ణాటక చేపడుతున్న ఆల్మట్టి ప్రాజెక్టు ఎత్తు పెంపును సవాలు చేస్తూ సుప్రీంకోర్టులో ఇంటర్‌లొక్యూటరీ అప్లికేషన్ (ఐఏ) దాఖలు చేయాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. ఆల్మట్టి డ్యాం ఎత్తును 524.256 మీటర్లకు పెంచేందుకు బ్రిజేష్ కుమార్ ట్రైబ్యునల్ అనుమతించగా, దానిపై ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర సుప్రీంకోర్టును ఆశ్రయించాయి. దీంతో ట్రైబ్యునల్ నివేదిక అమలుపై సుప్రీంకోర్టు స్టే విధించింది. అయితే విచారణ కొనసాగుతున్నప్పటికీ, కర్ణాటక గత సెప్టెంబర్‌లో ముంపు ప్రాంతాల పునరావాసానికి రూ.70 వేల కోట్లు మంజూరు చేయడంతో, తెలంగాణ దీనిని సవాలు చేస్తూ కొత్త ఐఏ దాఖలు చేయాలని భావిస్తోంది.
మరోవైపు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపడుతున్న పోలవరం–బనకచర్ల అనుసంధాన ప్రాజెక్టుపై కూడా సుప్రీంకోర్టులో వ్యాజ్యం దాఖలు చేయనుంది. ఈ ప్రాజెక్టుపై తెలంగాణ సహా పలు రాష్ట్రాలు, కేంద్ర జల సంఘం (సీడబ్ల్యూసీ), పర్యావరణ నిపుణులు తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేశాయి. గోదావరిలో నీటి లభ్యత, అంతర్రాష్ట్ర అనుమతులు లేకుండా ముందుకు సాగొద్దని కేంద్ర సంస్థలు హెచ్చరించాయి. అయినప్పటికీ, ఏపీ ప్రభుత్వం డీపీఆర్ సిద్ధం చేయడానికి టెండర్లను ఆహ్వానించింది. కేంద్రం నుంచి చర్యలు లేకపోవడంతో, సుప్రీంకోర్టు ద్వారానే ప్రాజెక్టును నిలిపివేయాలని తెలంగాణ నిర్ణయించింది.
అయితే ఈ నిర్ణయంపై కొంతమంది జలవనరుల నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సుప్రీంకోర్టును ఆశ్రయించడం వల్ల ప్రాజెక్టుకు పరోక్షంగా చట్టబద్ధత కలిగినట్లు భావించే అవకాశం ఉందని, కేసు స్వీకరించినట్లయితే ఇతర వేదికల్లో వ్యతిరేకించే అవకాశాలు తగ్గుతాయని వారు అభిప్రాయపడ్డారు.