కర్ణాటక, మహారాష్ట్ర రాష్ట్రాల్లో కురుస్తున్న భారీ వర్షాల ప్రభావంతో కృష్ణా నది పరవళ్లు తొక్కుతోంది. సుంకేశుల, జూరాల ప్రాజెక్టుల నుంచి శ్రీశైలం జలాశయానికి 2,89,670 క్యూసెక్కుల వరద నీరు చేరుతోంది. దీంతో అధికారులు 3,02,478 క్యూసెక్కుల నీటిని జలాశయం నుంచి విడుదల చేస్తున్నారు.
ఇందులో 8 స్పిల్ వే గేట్ల ద్వారా 2,16,520 క్యూసెక్కులు, పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ ద్వారా 20,000 క్యూసెక్కులు, ఎడమ గట్టు విద్యుత్ కేంద్రం నుంచి 35,315 క్యూసెక్కులు, కుడి గట్టు విద్యుత్ కేంద్రం నుంచి 30,643 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు.
శ్రీశైలం జలాశయం యొక్క పూర్తి స్థాయి నీటి మట్టం (FRL) 885 అడుగులు కాగా, ప్రస్తుతం నీటి మట్టం 882.80 అడుగులకు చేరింది. మొత్తం నీటి నిల్వ సామర్థ్యం 215.80 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 203.42 టీఎంసీల నీటి నిల్వ నమోదైంది. అధికారులు వరద పరిస్థితిని క్షుణ్ణంగా పర్యవేక్షిస్తున్నారు.