ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా కృష్ణా నదికి వరద ప్రవాహం కొనసాగుతోంది. జూరాల, సుంకేశుల నుంచి 1,17,221 క్యూసెక్కుల నీరు శ్రీశైలం జలాశయానికి చేరుతోంది. దీంతో జలాశయం నిండుకుండలా మారింది.
ఈ నేపథ్యంలో ఏడు గేట్లు పది అడుగుల మేర ఎత్తి 1,87,208 క్యూసెక్కుల నీటిని నాగార్జునసాగర్ వైపు విడుదల చేస్తున్నారు. అదనంగా కుడి, ఎడమ గట్టు జల విద్యుత్ కేంద్రాల ద్వారా విద్యుత్ ఉత్పత్తి చేస్తూ 65,632 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు.
శ్రీశైలం జలాశయం నీటి మట్టం నేటి ఉదయానికి 882.10 అడుగులు, ప్రస్తుత నిల్వ 199.2737 టీఎంసీలు గా నమోదైంది. అధికారులు వరద ప్రవాహాన్ని నిరంతరం పర్యవేక్షిస్తున్నారు.