ఏపీకి భారీ వర్షాలు.. పలు జిల్లాలకు పిడుగుల హెచ్చరిక

ఏపీపై కొనసాగుతున్న ఉపరితల ద్రోణుల ప్రభావం, రానున్న 24 గంటల్లో పలు జిల్లాలకు భారీ వర్ష సూచన
ఆంధ్రప్రదేశ్‌లో వాతావరణ పరిస్థితులు ఒక్కసారిగా మారాయి. ఉపరితల ద్రోణుల ప్రభావంతో రానున్న 24 గంటల్లో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో పిడుగులతో కూడిన భారీ వర్షాలు పడే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, పొలాల్లో పనిచేసే రైతులు, కూలీలు సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని సూచించింది.

విపత్తుల నిర్వహణ సంస్థ అంచనా ప్రకారం, నెల్లూరు, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో కొన్ని చోట్ల భారీ వర్షాలు పడవచ్చు. అలాగే, కోనసీమ, ఉభయ గోదావరి, ఏలూరు, కృష్ణా, గుంటూరు, బాపట్ల, ప్రకాశం జిల్లాల్లో పిడుగులతో కూడిన వానలు పడే అవకాశం ఉంది. వాతావరణ శాఖ కూడా రాయలసీమలో అనేకచోట్ల, కోస్తాంధ్రలో పలుచోట్ల ఈదురుగాలులతో వర్షాలు పడతాయని పేర్కొంది. ముఖ్యంగా రాయలసీమ, దక్షిణ కోస్తా ప్రాంతాల్లో అక్కడక్కడా కుండపోత వానలు కురవచ్చని అంచనా వేశారు.

ప్రస్తుతం, మధ్యప్రదేశ్ నుంచి తెలంగాణ, కోస్తాంధ్ర మీదుగా బంగాళాఖాతం వరకు ఒక ఉపరితల ద్రోణి విస్తరించి ఉంది. అలాగే, దక్షిణ కర్ణాటక నుంచి తమిళనాడు మీదుగా కొమరిన్ ప్రాంతం వరకు మరో ద్రోణి కొనసాగుతోంది. రాష్ట్రంలో ఎండ తీవ్రత కూడా అధికంగా ఉండటంతో వాతావరణ అనిశ్చితి నెలకొంది. నిన్న ప్రకాశం జిల్లా ఒంగోలులో 6.4 సెం.మీ., విజయనగరం జిల్లా రాజాంలో 4 సెం.మీ. వర్షపాతం నమోదైంది.

ఇదిలా ఉండగా, బంగాళాఖాతంలోనూ వాతావరణ మార్పులు చోటుచేసుకుంటున్నాయి. ఈ నెల 22 లేదా 23 తేదీల్లో ఉత్తర బంగాళాఖాతంలో ఒక ఉపరితల ఆవర్తనం ఏర్పడనుందని, అది అల్పపీడనంగా మారుతుందా లేదా అనే దానిపై త్వరలో స్పష్టత వస్తుందని ఇస్రో వాతావరణ నిపుణులు తెలిపారు. అనంతరం ఈ నెల 26 లేదా 27న మధ్య బంగాళాఖాతంలో మరో ఆవర్తనం ఏర్పడనుందని, ఇది మరింత బలపడే అవకాశం ఉందని అంచనా వేశారు.


Today's Best Deals

Rs. 270.00

Emoji Expressions Matching Game

Rs. 480.00

Labubu Bunny Keychain

Rs. 100.00

Face Changing Keychain

Rs. 230.00

Busy Book