బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. అలాగే కర్ణాటక నుంచి గల్ఫ్ ఆఫ్ మన్నార్ వరకు తమిళనాడు మీదుగా ద్రోణి కొనసాగుతోంది. ఈ ప్రభావంతో రాష్ట్రంలోని కోస్తా జిల్లాల్లో రాబోయే నాలుగు రోజుల పాటు పిడుగులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం అధికారులు హెచ్చరించారు. మిగతా ప్రాంతాల్లో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది.
బుధవారం, గురువారం రోజుల్లో అల్లూరి సీతారామరాజు, ఏలూరు, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. శుక్రవారం నాడు ఏలూరు, ఎన్టీఆర్, గుంటూరు, పల్నాడు, బాపట్ల, ప్రకాశం జిల్లాల్లో వర్షపాతం తీవ్రంగా ఉండనుంది.
అదేవిధంగా, తీర ప్రాంతాల్లో గురువారం గంటకు 40 నుండి 60 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉండటంతో, మత్స్యకారులు వేటకు వెళ్లరాదని విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ హెచ్చరించారు.