పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం కారణంగా ఆంధ్రప్రదేశ్‌లోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ శాఖ ప్రకటించింది. ఏపీ తీరానికి ఆనుకుని సముద్ర మట్టానికి సుమారు 0.9 కిలోమీటర్ల ఎత్తులో ఈ ఆవర్తనం కొనసాగుతోందని అధికారులు తెలిపారు. దీని ప్రభావంతో రాబోయే రెండు రోజులపాటు తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేశారు.
బుధవారం కోనసీమ, కృష్ణా, గుంటూరు, బాపట్ల, ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, కడప, తిరుపతి జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపింది. అలాగే ఎల్లుండి (శుక్రవారం) నెల్లూరు మరియు రాయలసీమ జిల్లాల్లో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు పడవచ్చని అంచనా.
విపత్తుల నిర్వహణ శాఖ ప్రజలను అప్రమత్తంగా ఉండాలని సూచించింది. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తున్నప్పుడు రైతులు, కూలీలు, పశువుల కాపరులు పొలాల్లో కాకుండా సురక్షిత ప్రదేశాల్లో ఉండాలని సూచించారు. చెట్ల కింద లేదా విద్యుత్ స్తంభాల సమీపంలో ఆశ్రయం పొందవద్దని హెచ్చరించారు.