ఆంధ్రప్రదేశ్‌లో వచ్చే మూడు రోజుల వర్షాల సూచన
ఉపరితల ఆవర్తన ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌లోని పలు జిల్లాల్లో మరో మూడు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశముందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, బీహార్, జార్ఖండ్, ఛత్తీస్‌గఢ్, పశ్చిమ బెంగాల్, సిక్కిం, ఒడిశా, తెలంగాణలోని కొన్ని ప్రాంతాల నుంచి రాబోయే రెండు–మూడు రోజుల్లో నైరుతి రుతుపవనాల ఉపసంహరణకు అనుకూల పరిస్థితులు ఏర్పడతాయని వాతావరణ శాఖ వెల్లడించింది.
వీటి ప్రభావంతో ఉత్తర, దక్షిణ కోస్తా జిల్లాలు, రాయలసీమ ప్రాంతాలు మరియు యానాం ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. కొన్ని ప్రాంతాల్లో పిడుగులు, మెరుపులతో కూడిన వర్షాలు కూడా కురిసే అవకాశం ఉందని అధికారులు అంచనా వేశారు.
సోమవారం (13వ తేదీ) అల్లూరి సీతారామరాజు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నంద్యాల, కడప, అన్నమయ్య, చిత్తూరు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ఒక ప్రకటనలో వెల్లడించింది. ప్రజలు ఆకస్మాత్తుగా ఉరుములు, మెరుపులతో వర్షాలు పడే అవకాశం ఉన్నందున జాగ్రత్తగా ఉండాలని సూచించారు.
గత కొన్ని రోజుల్లోని వర్షపాతం వివరాల ప్రకారం, విజయనగరం జిల్లా గొల్లపాడులో 35.2 మి.మీ, కాకినాడ జిల్లా ప్రత్తిపాడులో 32.5 మి.మీ, విజయనగరం జిల్లా రేగిడి ఆమదాలవలసలో 32.2 మి.మీ, అనకాపల్లి జిల్లా కృష్ణదేవిపేటలో 28 మి.మీ వర్షం పడింది.