తెలంగాణ ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఖాళీగా ఉన్న 1,623 పోస్టుల భర్తీకి ప్రభుత్వం నియామక నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇందులో తెలంగాణ వైద్య విధాన పరిషత్ (TVVP) ఆసుపత్రుల్లో 1,616 సివిల్ అసిస్టెంట్ సర్జన్ పోస్టులు, అలాగే ఆర్టీసీ ఆసుపత్రుల్లో 7 పోస్టులు భర్తీ చేయనున్నట్లు ప్రకటించింది. అర్హత గల వైద్యులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపింది. దరఖాస్తు ప్రక్రియ సెప్టెంబర్ 8న ప్రారంభమై అక్టోబర్ 22న ముగియనుంది.
ఈ నియామకాలు జోన్ వారీగా జరుగుతాయి. మల్టీజోన్ 1లో 858 ఖాళీలు, మల్టీజోన్ 2లో 765 ఖాళీలు ఉన్నాయని అధికారులు వివరించారు. ఇప్పటికే కాంట్రాక్ట్ విధానంలో పనిచేస్తున్న వైద్యులకు పోస్టుల భర్తీలో 20 పాయింట్ల ప్రాధాన్యత ఇవ్వబడుతుందని వెల్లడించారు. పోస్టుల విభాగాల వారీ వివరాలు, అర్హతలు మరియు దరఖాస్తు విధానం కోసం అభ్యర్థులు అధికారిక నోటిఫికేషన్ చూడాలని సూచించారు.