హైదరాబాద్‌లోని తాజ్‌కృష్ణ హోటల్‌లో అమెరికా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి హాజరయ్యారు. ఆయన మాట్లాడుతూ, హైదరాబాద్‌ను కేంద్రంగా 200కి పైగా అమెరికన్ కంపెనీలు పనిచేస్తున్నట్లు తెలిపారు.
ఈ కార్యక్రమంలో హైదరాబాద్‌లోని అమెరికా కాన్సులేట్ జనరల్ జెన్నిఫర్ లార్సన్ కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా రేవంత్ మాట్లాడుతూ, అమెరికాకు స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత ప్రపంచం ఎంతో మారిందని తెలిపారు. తెలంగాణ – అమెరికా మధ్య వ్యాపార సంబంధాలను మరింత బలోపేతం చేయాలని ఆయన చెప్పారు.
2047 నాటికి తెలంగాణను మూడు ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా అభివృద్ధి చేయడమే లక్ష్యమని సీఎం రేవంత్ పేర్కొన్నారు. అందుకు అమెరికా ప్రభుత్వంతో పాటు అక్కడి ప్రజల మద్దతు అవసరమని చెప్పారు. అమెరికాలో తెలుగు భాష వేగంగా పెరుగుతోందని, అక్కడ తెలుగు ప్రజలతో తెలంగాణకు మంచి అనుబంధం ఉందని తెలిపారు.