తెలంగాణ రాష్ట్రంలోని మహిళా స్వయం సహాయక సంఘాలకు శుభవార్త. సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రభుత్వం రూ.344 కోట్ల వడ్డీ లేని రుణాలు మంజూరు చేసింది. ఈ నిర్ణయంతో రాష్ట్రవ్యాప్తంగా మహిళా సంఘాలకు ఆర్థిక సహాయం అందనుంది.
ఈ మొత్తంలో రూ.300 కోట్లు గ్రామీణ మహిళా సంఘాలకు, రూ.44 కోట్లు పట్టణ మహిళా సంఘాలకు కేటాయించారు. ఈ నిధులను జులై 13 నుండి 18వ తేదీ వరకు మహిళా సంఘాల ఖాతాల్లో జమ చేయనున్నారు. రాష్ట్ర ఆర్థిక శాఖ ఈ నిధులను సెర్ప్‌కి విడుదల చేసింది.
ఈ కార్యక్రమంలో అన్ని నియోజకవర్గాల్లో మంత్రులు, ఎమ్మెల్యేలు పాల్గొని చెక్కుల పంపిణీ చేస్తారు. ప్రమాద బీమా, లోన్ బీమా చెక్కులు కూడా పంపిణీ చేయనున్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో నిలిచిన వడ్డీ లేని రుణాలను ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం తిరిగి ప్రారంభిస్తోంది. అప్పట్లో సుమారు రూ.3,000 కోట్ల బకాయిలు పెండింగ్‌లో ఉన్నాయని సమాచారం.