యూఐటీపీ 2025 అవార్డుల్లో హైదరాబాద్ మెట్రోకు అంతర్జాతీయ గుర్తింపు
జర్మనీలోని హాంబర్గ్ నగరంలో జరిగిన యూఐటీపీ (UITP) 2025 పురస్కారాల కార్యక్రమంలో హైదరాబాద్ మెట్రో రైలు ప్రత్యేక గుర్తింపు పొందింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న రవాణా సంస్థల నుంచి వచ్చిన 500 ఎంట్రీల మధ్య, ఎల్‌అండ్‌టీ మెట్రో రైలు హైదరాబాద్ లిమిటెడ్ (ఎల్‌అండ్‌టీ ఎంఆర్‌హెచ్‌ఎల్) ను ‘ఆపరేషనల్ ఎక్సలెన్స్’ విభాగంలో టాప్ 5 ఫైనలిస్ట్‌గా ఎంపిక చేశారు.
"ఆప్టిమైజ్డ్ మెట్రో ఆపరేషన్ ప్లాన్స్ లీడింగ్ టు ఇన్‌క్రీజ్డ్ రెవెన్యూ ఫర్ ట్రెయిన్" అనే ప్రాజెక్టుకు ఈ గుర్తింపు లభించింది. రోడ్స్ అండ్ ట్రాన్స్‌పోర్ట్ అథారిటీ (ఆర్‌టీఏ) సహకారంతో రూపొందించిన ఈ ప్రణాళిక ద్వారా ఆదాయాన్ని పెంచడమే కాక, మెట్రో కార్యకలాపాలను సమర్థంగా నిర్వహించారు. డేటా ఆధారిత పద్ధతులు వినియోగించి మెట్రో నిర్వహణను మెరుగుపరిచినందుకే ఈ గుర్తింపు లభించింది.
ఈ సందర్భంగా ఎల్‌అండ్‌టీ ఎంఆర్‌హెచ్‌ఎల్ ఎండీ & సీఈవో కేవీబీ రెడ్డి మాట్లాడుతూ, “ప్రపంచ స్థాయిలో మెట్రో సేవలలో ఉత్తమ నిపుణతను పాటించే సంస్థలకు యూఐటీపీ పురస్కారాలు అందిస్తుంది. మా వినూత్న వ్యూహాలతో, సమర్థవంతమైన నిర్వహణతో హైదరాబాద్ మెట్రోకు ఈ గుర్తింపు రావడం గర్వంగా ఉంది” అన్నారు. నిపుణులు ఈ పురస్కారాన్ని హైదరాబాద్ మెట్రో అందిస్తున్న నాణ్యమైన సేవలకు గుర్తింపుగా పేర్కొన్నారు.