భద్రాచలం వద్ద ఉగ్రరూపంలో గోదావరి – తొలి ప్రమాద హెచ్చరిక జారీ
ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలు మరియు ఎడతెరిపిలేని ప్రవాహాల కారణంగా భద్రాచలం వద్ద గోదావరి ఉగ్రరూపం దాల్చింది. ప్రస్తుతం గోదావరి నీటిమట్టం 43 అడుగులకు చేరుకోవడంతో, అధికారులు మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. నదీ తీర ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
ప్రస్తుతం భద్రాచలంలో గోదావరిలో సుమారు 9,40,345 క్యూసెక్కుల వరదనీరు ప్రవహిస్తోంది. దీంతో స్నానఘట్టాలు పూర్తిగా నీటమునిగిపోయాయి, వరద నీరు కళ్యాణకట్టను తాకింది. ఈ నేపథ్యంలో భక్తులు స్నానాల కోసం నదిలోకి దిగరాదని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.
వరద ప్రభావం ప్రసిద్ధ పుణ్యక్షేత్రం పర్ణశాలలో కూడా కనిపిస్తోంది. సీతమ్మ నారచీరలు ప్రాంతం, సీతమ్మ విగ్రహం వరద నీటిలో మునిగిపోయాయి.
ఇక తుంగభద్ర జలాశయం కూడా భారీ వరదలను అందుకుంటోంది. ప్రాజెక్టుకు 1,28,453 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తుండగా, అధికారులు 26 గేట్లు ఎత్తి 1,30,715 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. గోదావరి, తుంగభద్ర నదుల వరద ఉద్ధృతి కొనసాగుతుండటంతో అధికారులు పరిస్థితిని సమీక్షిస్తున్నారు.