గోదావరి వరద ప్రవాహం పెరుగుతోంది – పాపికొండల బోటు యాత్రలకు తాత్కాలిక విరామం
గోదావరి నదిలో నీటిమట్టం క్రమంగా పెరుగుతోంది. గత ఐదు రోజులుగా ఎగువ ప్రాంతాలు మరియు రాష్ట్రాల్లో కురుస్తున్న భారీ వర్షాల వల్ల ఉపనదులు, వాగులు ఉప్పొంగి గోదావరిలో కలుస్తున్నాయి. దీని కారణంగా వరద ప్రవాహం పెరుగుతోంది.
ఈ నేపథ్యంలో పోలవరం ప్రాజెక్ట్ స్పిల్ వే ద్వారా 49 వేల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. గోదావరిలో నీటి ప్రవాహం పెరుగుతుండటంతో జలవనరుల శాఖ అధికారులు అప్రమత్తంగా ఉన్నారు.
అల్లూరి జిల్లా దేవీపట్నం నుంచి పాపికొండల బోటు విహారయాత్రను తాత్కాలికంగా నిలిపేశారు. దేవీపట్నం మండలం దండంగి – డి. రావిలంక గ్రామాల మధ్య ఆర్ అండ్ బీ రోడ్డుపై వరద నీరు ప్రవహిస్తోంది. దీంతో గండి పోచమ్మ ఆలయం వైపు రాకపోకలు నిలిచిపోయాయి.