ఆంధ్రప్రదేశ్ కొత్త రాజధాని అమరావతిలో 74 అభివృద్ధి ప్రాజెక్టులు అధికారికంగా ప్రారంభమయ్యాయి. ఈ పనుల విలువ రూ.50,552 కోట్లు కాగా, మరిన్ని పనుల కోసం టెండర్లు పిలిచి మొత్తం పెట్టుబడి రూ.81,317 కోట్లకు చేరింది.
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సీఆర్‌డీఏ, ఈడీసీ అధికారులతో సమావేశమై రాజధాని నిర్మాణ పురోగతిని సమీక్షించారు. ఇందులో భూకేటాయింపులు, మౌలిక వసతుల నిర్మాణం, మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులు, న్యాయమూర్తుల నివాసాలు, రహదారులు, డ్రైనేజీ, యుటిలిటీ డక్టులు, వరద నియంత్రణ వ్యవస్థలు వంటి అంశాలు చర్చించబడ్డాయి. పనులను ఆరు నెలల ముందుగానే, నాణ్యత తగ్గకుండా పూర్తి చేయాలని సీఎం ఆదేశించారు.
అమరావతిని ప్రపంచంలోనే అత్యుత్తమ నివాసయోగ్య నగరంగా తీర్చిదిద్దాలని సీఎం లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇందుకోసం పెట్టుబడులు, వ్యాపారాలు ఆకర్షించడంతో పాటు ఉద్యోగావకాశాలు సృష్టించాలని సూచించారు. జ్ఞాన ఆధారిత ఆర్థిక వ్యవస్థను అభివృద్ధి చేయాలని, దేశంలోని ప్రముఖ రియల్ ఎస్టేట్ కంపెనీలను ఆహ్వానించాలని, ఎలక్ట్రిక్ వాహనాలను ప్రోత్సహించి గ్రీన్ ఎనర్జీ కారిడార్‌గా మార్చాలని తెలిపారు. అభివృద్ధి పనులను రియల్ టైమ్‌లో పర్యవేక్షించి, నెలవారీ సమీక్షలు నిర్వహించాలన్నది ఆయన ఆదేశం. అలాగే రాజధాని ప్రాంతంలో గాలి నాణ్యతను కూడా పర్యవేక్షించాలని సూచించారు.