రాజధాని రైతులకు రాష్ట్ర ప్రభుత్వం భారీ ఊరట
అమరావతి రాజధాని నిర్మాణంలో ల్యాండ్ పూలింగ్‌లో తమ అసైన్డ్ భూములను ఇచ్చిన రైతులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త ప్రకటించింది. సమస్యల పరిష్కారం కోసం కీలక నిర్ణయం తీసుకున్న ప్రభుత్వం, రిటర్నబుల్ ప్లాట్ల యాజమాన్య ధ్రువపత్రాల నుంచి ‘అసైన్డ్’ అనే పదాన్ని తొలగిస్తూ, ఈ ప్లాట్లను ఇకపై ‘పట్టా భూమి’గా పరిగణించనుందని బుధవారం అధికారికంగా జారీ చేసిన ఉత్తర్వులు వెల్లడించాయి.
ఏళ్ల తరబడి రైతుల ఆవేదన
ల్యాండ్ పూలింగ్ కింద కేటాయించిన ప్లాట్ల యాజమాన్య ధ్రువపత్రాలపై ‘అసైన్డ్’ ముద్ర ఉండటం వల్ల రైతులు ప్లాట్లను అమ్మడం, ఇతర లావాదేవీలు నిర్వహించడం కష్టంగా మారింది. మార్కెట్‌లో సరైన ధరకు అమ్మకాలు జరగక, తక్కువ మొత్తంలో మాత్రమే విక్రయించాల్సి రావడం కారణంగా రైతులు తరచూ ఆవేదన వ్యక్తం చేశారు.
సీఎం ఆదేశాలతో ప్రభుత్వం చర్య
రైతుల ఇబ్బందులను గుర్తించిన సీఆర్డీఏ కమిషనర్ కన్నబాబు, ఈ సమస్యను సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లారు. సీఎం సానుకూల స్పందనతో యాజమాన్య ధ్రువపత్రాల నుంచి ‘అసైన్డ్’ పదాన్ని తొలగించి, దానిని ‘పట్టా భూమి’గా మార్చాలని ఆదేశించారు.
అధికారుల సూచనల మేరకు, ల్యాండ్ పూలింగ్ చట్టంలోని రూల్ నంబర్ 11(4) సవరిస్తూ పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి సురేశ్ కుమార్ జీఓ ఎం.ఎస్. నంబర్ 187ని విడుదల చేశారు. ఈ నిర్ణయం రాజధాని రైతులకు భారీ ఊరటగా నిలిచింది.