ఈశాన్య రుతుపవనాల ప్రభావం కారణంగా ఆంధ్రప్రదేశ్‌లోని పలు జిల్లాల్లో వర్షాల అవకాశం ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. శుక్రవారం (అక్టోబర్ 17) ప్రకాశం, నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశముందని సూచించింది. అలాగే అనంతపురం, శ్రీ సత్యసాయి, కడప, అన్నమయ్య, చిత్తూరు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది.
దక్షిణ కోస్తా తీరం వెంబడి గంటకు 35-55 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశముందని, మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్లవద్దని సూచించింది. ప్రజలు చెట్లు, విద్యుత్ స్తంభాలు, భారీ హోర్డింగ్స్ వంటి వాటి దగ్గర నిలబడకూడదని అప్రమత్తంగా ఉండమని విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది.