ఈ ఏడాది సాధారణం కంటే ఎక్కువ ఈశాన్య రుతుపవనాలు కురిసే అవకాశాలు ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. రాయలసీమలో వాతావరణ శాఖ కీలక హెచ్చరికలు జారీ చేసింది. చిత్తూరు పరిసర ప్రాంతాల్లో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం కారణంగా, రాబోయే 24 గంటల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని సూచించింది. రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల్లో కూడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని వెల్లడించింది. సోమవారం రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో ఇప్పటికే వర్షాలు కురిశాయని సమాచారం ఉంది.
భారత వాతావరణ శాఖ (IMD) రానున్న మూడు నెలల రుతుపవనాల అంచనాలను వెల్లడిస్తూ, ఈసారి ఈశాన్య రుతుపవనాలు సాధారణం కంటే ఎక్కువ కురిసే అవకాశం ఉందని తెలిపింది. అక్టోబరు నుండి డిసెంబరు వరకు ఈశాన్య రుతుపవనాల సీజన్ కొనసాగుతుంది. ఈ మూడు నెలల్లో సగటుతో పోలిస్తే 112 శాతం అధిక వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని IMD అంచనా వేస్తోంది. ముఖ్యంగా అక్టోబరు నెలలో వర్షపాతం 115 శాతం వరకు ఉండే అవకాశం ఉంది.
సాధారణంగా ఈ రుతుపవనాలు దక్షిణ భారతదేశంలోని తమిళనాడు, పుదుచ్చేరి, కేరళతో పాటు ఆంధ్రప్రదేశ్‌లోని కోస్తాంధ్ర, రాయలసీమ ప్రాంతాలకు ఎక్కువగా ప్రభావితం చేస్తాయి. వాతావరణ నమూనాల అంచనాల ప్రకారం, అక్టోబరు 17 నుంచి 21వ తేదీ మధ్య ఈశాన్య రుతుపవనాలు ప్రవేశించే అవకాశముందని నిపుణులు సూచిస్తున్నారు. నైరుతి రుతుపవనాలు ముగిసిన వెంటనే ఈశాన్య రుతుపవనాలు ప్రభావం చూపటం ప్రారంభమయ్యే అవకాశం ఉన్నందున రైతుల్లో ఉత్సాహం వ్యక్తమవుతోంది.