ఆంధ్రప్రదేశ్ వాతావరణ హెచ్చరిక: పలు జిల్లాల్లో ఉరుములతో కూడిన వానల సూచన
ఇటీవలి మొంథా తుపాను ప్రభావం నుంచి ఇంకా పూర్తిగా తేరుకోకముందే వాతావరణ శాఖ మరోసారి వర్ష సూచన జారీ చేసింది. ఆంధ్రప్రదేశ్‌లో పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
ఆంధ్రప్రదేశ్ విపత్తుల నిర్వహణ సంస్థ (APSDMA) ప్రకటన ప్రకారం, కోనసీమ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, అనంతపురం, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో మంగళవారం పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉంది.
మిగిలిన జిల్లాల్లో తేలికపాటి జల్లులు పడే అవకాశం ఉందని తెలిపింది. వర్షం కురిసే సమయంలో ఉరుములు, మెరుపులు ఉండే అవకాశం ఉన్నందున ప్రజలు చెట్ల కింద లేదా ఓపెన్ ప్రదేశాల్లో ఉండకూడదని హెచ్చరించింది. రైతులు, కూలీలు వర్షం సమయంలో సురక్షిత ప్రదేశాల్లో ఉండాలని విపత్తు నిర్వహణ సంస్థ సూచించింది.