తెలంగాణ వాతావరణం: ఐదు జిల్లాలకు భారీ వర్షాల హెచ్చరిక
తెలంగాణ రాష్ట్రంలో వాతావరణం భిన్నంగా మారుతోంది. కొన్ని జిల్లాల్లో వర్షపాతం లోటు ఆందోళన కలిగిస్తుంటే, మరోవైపు వాతావరణ శాఖ రానున్న రెండు రోజుల్లో ఐదు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరికలు జారీ చేసింది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో ఈ వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.
వాతావరణ శాఖ అంచనాల ప్రకారం వాయవ్య బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం రాబోయే 24 గంటల్లో అల్పపీడనంగా మారనుంది. దీనికి రుతుపవన ద్రోణి కూడా తోడవడంతో మంగళవారం, బుధవారం రోజుల్లో భద్రాద్రి కొత్తగూడెం, జయశంకర్ భూపాలపల్లి, మహబూబాబాద్, ములుగు, వరంగల్ జిల్లాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. ఇతర జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది.
ఇక మరోవైపు రాష్ట్రంలోని పలు జిల్లాలు వర్షాల లోటుతో ఇబ్బంది పడుతున్నాయి. ఆగస్టు 18వ తేదీ వరకు రాష్ట్ర సగటు వర్షపాతం 14% అధికంగా ఉండగా, గత వారం రోజులుగా వర్షాలు తగ్గిపోవడంతో సోమవారం నాటికి 9% లోటులోకి పడిపోయింది. ఇందులో నిర్మల్ జిల్లాలో అత్యధికంగా 44% వర్షపాతం లోటు నమోదైంది. పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, నల్గొండ జిల్లాల్లో కూడా వర్షాల లోటు కొనసాగుతోంది.