హరి హర వీరమల్లు చిత్రీకరణపై కీలక అప్డేట్ ఇచ్చిన చిత్ర నిర్మాత ఎ.ఎం. రత్నం
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా జ్యోతికృష్ణ దర్శకత్వంలో రూపొందుతున్న "హరి హర వీరమల్లు" చిత్రంపై ఒక కీలకమైన అప్‌డేట్ వెలువడింది. ఈ భారీ బడ్జెట్ చిత్రాన్ని రెండు భాగాలుగా రూపొందించాలనుకుంటున్నారు, మొదటి భాగం "హరి హర వీరమల్లు పార్ట్ 1: స్వార్డ్ వర్సెస్ స్పిరిట్" పేరుతో విడుదల కానుంది.
ఇప్పటికే విడుదలైన పోస్టర్లు, వీడియో క్లిప్స్, పాటలతో సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి. మొదటి భాగం చిత్రీకరణ చివరి దశకు చేరుకుంది. అయితే, పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో బిజీగా ఉండటంతో, షూటింగ్ కొన్ని సార్లు వాయిదా పడింది.
తాజాగా, ఆదివారం పవన్ కళ్యాణ్ "హరి హర వీరమల్లు" చిత్రీకరణలో పాల్గొన్నారు. ఈ విషయాన్ని చిత్ర బృందం 'ఎక్స్' వేదికగా వెల్లడించింది. ఈ చిత్రీకరణలో రెండు రోజుల పాటు పవన్ కళ్యాణ్ పాల్గొంటారని ప్రకటించింది.
చిత్ర నిర్మాత ఎ.ఎం. రత్నం తన ట్వీట్‌లో "చాలా కాలంగా ఎదురుచూస్తున్న ఎక్స్‌ప్లోజివ్ ట్రైలర్, ఎలక్ట్రిఫైయింగ్ పాటల కోసం సిద్ధంగా ఉండండి! తుఫానుకు కౌంట్‌డౌన్ ఇప్పుడు ప్రారంభమవుతుంది. షూటింగ్ ముగింపు దశకు చేరుకుంది" అని తెలిపారు. ప్రస్తుతం ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.