ఒడిశా-ఉత్తర కోస్తా మధ్య వాయుగుండం ప్రభావం – శ్రీకాకుళంలో అప్రమత్త చర్యలు
ఒడిశాలోని గోపాల్‌పూర్‌కు దక్షిణ ఆగ్నేయ దిశగా వాయుగుండం కేంద్రీకృతమై ఉంది. ఇది ఈ రోజు మధ్యాహ్నం ఒడిశా–ఉత్తర ఆంధ్రా తీరం మధ్య దాటే అవకాశముందని విశాఖ వాతావరణ శాఖ హెచ్చరించింది.
ఈ ప్రభావంతో కోస్తాంధ్ర తీరం వెంబడి గంటకు 45–55 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీచే అవకాశం ఉంది. ఉత్తర కోస్తాలో కొన్ని ప్రాంతాల్లో అతిభారీ వర్షాలు, మిగతా జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.
శ్రీకాకుళం జిల్లా యంత్రాంగం ముందస్తు చర్యలు తీసుకుంది. ఈ రోజు జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు, అంగన్వాడీలకు సెలవు ప్రకటించారు. నాగావళి నదిలో వరద ప్రవాహం పెరుగుతున్నట్లు అధికారులు పేర్కొన్నారు.
కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు, రాష్ట్ర మంత్రి అచ్చెన్నాయుడు అధికారులతో సమీక్ష నిర్వహించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, మత్స్యకారులు సముద్ర వేటకు వెళ్లవద్దని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ హెచ్చరించారు.
అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేందుకు శ్రీకాకుళం కలెక్టరేట్‌లో కంట్రోల్ రూమ్ (ఫోన్: 08942–240557) ఏర్పాటు చేశారు. ప్రజలు అవసరమైతే ఈ నంబర్‌ను సంప్రదించాలని జిల్లా యంత్రాంగం విజ్ఞప్తి చేసింది.