మొంథా తుఫాను తీరం దాటక ముందే ఆంధ్రప్రదేశ్ రవాణా వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపిస్తోంది. ముఖ్యంగా రైల్వే సర్వీసులు దాదాపు స్తంభించిపోయాయి. రైళ్లు, ఆర్టీసీ బస్సులు, విమాన సర్వీసులు రద్దు కావడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
రైల్వే శాఖ రికార్డు స్థాయిలో 100కు పైగా రైళ్లను రద్దు చేసింది. ఒక్క విజయవాడ డివిజన్ పరిధిలోనే 95 రైళ్లను నిలిపివేస్తున్నట్లు అధికారులు మూడు బులెటిన్ల ద్వారా ప్రకటించారు. విజయవాడ నుండి విశాఖపట్నం, గుంటూరు, తెనాలి, కాకినాడ, తిరుపతి, రాజమండ్రి వంటి ప్రాంతాలకు వెళ్లే రైళ్లతో పాటు భువనేశ్వర్, చెన్నై, హౌరా, బెంగళూరు వంటి దూరప్రాంత రైళ్లు కూడా రద్దు చేశారు. టికెట్లు రిజర్వు చేసుకున్న ప్రయాణికుల కోసం ప్రత్యేక రిఫండ్ కౌంటర్లను ఏర్పాటు చేసినట్లు రైల్వే అధికారులు తెలిపారు.
రోడ్డు రవాణాపై తుఫాను ప్రభావం రైల్వేతో పోలిస్తే కాస్త తక్కువగానే ఉంది. విజయవాడ నుంచి విశాఖపట్నం, కాకినాడ, రాజమండ్రి వెళ్లే 22 ఆర్టీసీ బస్సు సర్వీసులను రద్దు చేశారు. రవాణా శాఖ తనిఖీల కారణంగా ప్రైవేట్ బస్సులు చాలావరకు రోడ్డెక్కకపోవడంతో ప్రయాణికుల ఒత్తిడి ఆర్టీసీపై పెరిగింది. తుఫాను తీవ్రతను బట్టి మరిన్ని బస్సు సర్వీసులను రద్దు చేసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.
అధికారులు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అత్యవసర అవసరాలు తప్ప ప్రయాణం చేయవద్దని సూచించారు.