సింహాచలం దుర్ఘటనపై చంద్రబాబు దిగ్భ్రాంతి
సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీనరసింహస్వామి చందనోత్సవంలో చోటు చేసుకున్న అపశ్రుతి పై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. గోడ కూలి భక్తులు ప్రాణాలు కోల్పోయిన వార్త తనను కలచివేసిందని ఆవేదన వ్యక్తం చేశారు.
భారీ వర్షాల కారణంగా గోడ కూలిందని పేర్కొన్న చంద్రబాబు, మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. సింహాచలం పరిస్థితిపై జిల్లా కలెక్టర్, ఎస్పీతో మాట్లాడానని తెలిపారు.
గాయపడినవారికి మెరుగైన వైద్యం అందించాలంటూ అధికారులను ఆదేశించినట్లు తెలిపారు. పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నట్టు పేర్కొంటూ ‘ఎక్స్’లో తన స్పందనను పంచుకున్నారు.