దక్షిణాదిలో ఈ ఘనత సాధించిన మూడో రాజకీయ నేతగా గుర్తింపు
ఉమ్మడి ఏపీ, నవ్యాంధ్ర సీఎంగా సుదీర్ఘకాలం పనిచేసిన రికార్డు
సంక్షోభాలను ఎదుర్కొని, సంస్కరణలతో పాలన సాగించిన నేతగా పేరు
హైదరాబాద్ ఐటీ అభివృద్ధి, విద్యుత్ సంస్కరణల్లో కీలక పాత్ర
సాధారణ కుటుంబం నుంచి వచ్చి అరుదైన రాజకీయ మైలురాయి
తెలుగుదేశం పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తన రాజకీయ జీవితంలో మరో చారిత్రక మైలురాయిని అధిగమించారు. ఎలాంటి రాజకీయ నేపథ్యం లేని ఒక సాధారణ కుటుంబం నుంచి వచ్చి, ముఖ్యమంత్రిగా నేటితో (అక్టోబర్ 10) 15 సంవత్సరాల పదవీకాలాన్ని పూర్తి చేసుకున్నారు. సుదీర్ఘకాలం ముఖ్యమంత్రులుగా పనిచేసిన నేతల జాబితాలో దక్షిణాది నుంచి ఈ ఘనత సాధించిన మూడో వ్యక్తిగా ఆయన నిలిచారు. ఇంతకుముందు తమిళనాడు మాజీ సీఎం కరుణానిధి, పుదుచ్చేరి సీఎం ఎన్. రంగస్వామి మాత్రమే ఈ రికార్డును అందుకున్నారు.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు అత్యధిక కాలం ముఖ్యమంత్రిగా పనిచేసిన ఘనత కూడా చంద్రబాబు పేరు మీదే ఉంది. ఆయన ఉమ్మడి రాష్ట్రానికి 8 సంవత్సరాల 255 రోజులు సీఎంగా సేవలు అందించారు. ఇక, నవ్యాంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఇప్పటివరకు 6 సంవత్సరాల 110 రోజులు పూర్తి చేసుకున్నారు. మొత్తంగా 15 ఏళ్ల పాటు సీఎం పదవిలో కొనసాగి, ఎంజీ రామచంద్రన్, జయలలిత, ఈ.కే. నయనార్ వంటి ప్రముఖ నేతలను సైతం అధిగమించారు.
ఎదురైన రాజకీయ సంక్షోభాలను తట్టుకుని నిలబడటం, దీర్ఘకాలిక ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని సంస్కరణలు చేపట్టడం చంద్రబాబు రాజకీయ ప్రస్థానంలో కీలక ఘట్టాలు. హైదరాబాద్‌ను ఐటీ హబ్‌గా మార్చడంలో భాగంగా హైటెక్ సిటీకి పునాది వేయడం, విద్యుత్ రంగంలో సంస్కరణలు, ఇంజనీరింగ్ విద్యకు ప్రోత్సాహం వంటి నిర్ణయాలు తెలుగు రాష్ట్రాల అభివృద్ధిలో కీలక పాత్ర పోషించాయి.
2004లో ఓటమి తర్వాత పదేళ్లపాటు ప్రతిపక్షంలో ఉన్నా పార్టీని కాపాడుకున్నారు. రాష్ట్ర విభజన అనంతరం 2014లో నవ్యాంధ్రకు తొలి ముఖ్యమంత్రిగా గెలిచారు. ఆ తర్వాత 2019లో ఎదురైన కఠిన సవాళ్లను అధిగమించి, 2024లో ఘన విజయం సాధించి తిరిగి ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్ఠించారు. తిరుపతి సమీపంలోని ఓ కుగ్రామం నుంచి మొదలైన ఆయన ప్రయాణం, 15 ఏళ్ల ముఖ్యమంత్రిగా సాగడం ఆయన దూరదృష్టి, రాజకీయ నిబద్ధతకు నిదర్శనంగా నిలిచింది.