బీసీసీఐ సీనియర్ సెలక్షన్ కమిటీలో రెండు కొత్త నియామకాలు
బీసీసీఐ సీనియర్ మెన్స్ సెలక్షన్ కమిటీలో ఖాళీగా ఉన్న రెండు స్థానాలను భర్తీ చేసే ప్రక్రియ ప్రారంభమైంది. ఈ రేసులో మాజీ క్రికెటర్లు ఆర్పీ సింగ్, ప్రగ్యాన్ ఓజా పేర్లు ముందంజలో ఉన్నాయి. ముఖ్యంగా సౌత్ జోన్ కోటా నుంచి హైదరాబాదీ స్పిన్నర్ ప్రగ్యాన్ ఓజా ఎంపిక దాదాపు ఖాయమని జాతీయ మీడియా చెబుతోంది.
సెంట్రల్ జోన్‌కు చెందిన సుబ్రొతో బెనర్జీ, సౌత్ జోన్‌కు చెందిన ఎస్ శరత్ పదవీకాలం ముగియడంతో బీసీసీఐ కొత్తగా దరఖాస్తులను ఆహ్వానించింది. ఈ ఖాళీలకు ఆర్పీ సింగ్, ప్రగ్యాన్ ఓజా తో పాటు ప్రవీణ్ కుమార్, ఆశిష్ విన్‌స్టన్ జైదీ, శక్తి సింగ్ వంటి మాజీ క్రికెటర్లు కూడా పోటీలో ఉన్నారు.
ఆర్పీ సింగ్ 2007 టీ20 ప్రపంచకప్ విజేత భారత జట్టులో సభ్యుడిగా ఉన్నాడు. మరోవైపు ప్రగ్యాన్ ఓజా తన టెస్ట్ కెరీర్‌లో 113 వికెట్లు సాధించాడు. వీరిద్దరూ ఒకప్పుడు ఐపీఎల్‌లో డెక్కన్ ఛార్జర్స్ తరఫున కలిసి ఆడి, 2009లో టైటిల్ గెలిపించడంలో కీలక పాత్ర పోషించారు.
నిబంధనల ప్రకారం కనీసం 7 టెస్టులు లేదా 30 ఫస్ట్-క్లాస్ మ్యాచ్‌లు ఆడిన ఆటగాళ్లు, రిటైర్మెంట్‌కి ఐదేళ్లు పూర్తి అయిన తర్వాత సెలక్షన్ కమిటీలో సభ్యులుగా అర్హులు అవుతారు. ఈ అర్హతలు ఆర్పీ సింగ్, ప్రగ్యాన్ ఓజాలకు ఉన్నందున వీరి ఎంపిక ఖాయం కావచ్చని భావిస్తున్నారు. త్వరలో బీసీసీఐ అధికారిక ప్రకటన విడుదల చేయనుంది.