ఆసియా కప్ 2025 నిర్వహణపై నెలకొన్న అనిశ్చితి తొలగిపోయింది. ఈ మెగా టోర్నమెంట్ సెప్టెంబర్ 5న ప్రారంభం కానుంది. భారత్ – పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో టోర్నీపై సందేహాలు వ్యక్తమైనా, ఆసియా క్రికెట్ కౌన్సిల్ (ACC) చివరికి యూఏఈను వేదికగా ఎంపిక చేసింది.
ఆతిథ్య హక్కులు బీసీసీఐ వద్దే ఉన్నప్పటికీ, భద్రతా కారణాల వల్ల యూఏఈ వంటి తటస్థ వేదికను ఎంచుకున్నారు. 17 రోజుల పాటు జరగనున్న ఈ టోర్నమెంట్ సెప్టెంబర్ 21న ఫైనల్ తో ముగుస్తుంది. భారత్, పాకిస్థాన్, శ్రీలంక, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్, యూఏఈ జట్లు పాల్గొంటున్నాయి. గ్రూప్ దశ తర్వాత సూపర్-4, ఆపై ఫైనల్ మ్యాచ్ ఉంటుంది.
భారత్ – పాకిస్థాన్ మ్యాచ్‌కు సంబంధించిన తేదీ కూడా ఖరారైంది. ఈ హైవోల్టేజ్ పోరు సెప్టెంబర్ 7న జరగనుంది. పాల్గొంటున్న అన్ని జట్లు ఇప్పటికే తమ ప్రభుత్వాల అనుమతుల కోసం ప్రక్రియలో ఉన్నట్లు సమాచారం.
జమ్మూకశ్మీర్‌లో జరిగిన ఉగ్రదాడి తర్వాత భారత్, పాక్ మధ్య సంబంధాలు మరింత దెబ్బతిన్నాయి. ఈ నేపథ్యంలో ఆసియా కప్‌లో భారత్ పాల్గొనడం అనుమానంగా మారింది. అయితే బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకియా ఇప్పటికే “ఆసియా కప్ నుంచి భారత్ వైదొలగే ప్రసక్తే లేదు” అంటూ స్పష్టం చేశారు. తాజా పరిణామాలతో టోర్నీ పటిష్టంగా జరుగుతుందని క్రికెట్ వర్గాలు భావిస్తున్నాయి.