ఆస్ట్రేలియాతో జరిగిన తొలి వన్డేలో టీమిండియా సీనియర్ ఆటగాళ్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ నిరాశపరిచారు. ఏడునెలల విరామం తర్వాత అంతర్జాతీయ క్రికెట్‌లోకి తిరిగి వచ్చిన ఈ దిగ్గజాలు పెర్త్ వేదికగా పెద్దగా రాణించలేకపోయారు. అయితే రేపు అడిలైడ్‌లో జరగనున్న రెండో వన్డేలో వీరిద్దరూ బౌన్స్ బ్యాక్ అవుతారని అభిమానులు ఆశిస్తున్నారు. ముఖ్యంగా, అడిలైడ్ మైదానం కోహ్లీకి అదృష్టవంతమైన వేదిక కావడంతో, అభిమానుల్లో ఆసక్తి మరింత పెరిగింది.
రికార్డుల ప్రకారం చూస్తే, అడిలైడ్ అంటే కోహ్లీకి కంచుకోటే. ఈ మైదానంలో ఇప్పటివరకు ఆడిన నాలుగు వన్డేల్లో ఆయన 61 సగటుతో 244 పరుగులు సాధించాడు. అందులో రెండు సెంచరీలు ఉన్నాయి. టెస్టుల్లో కూడా కోహ్లీ రికార్డు అద్భుతం — ఐదు టెస్టుల్లో 53.70 సగటుతో 537 పరుగులు, అందులో మూడు సెంచరీలు ఉన్నాయి. అన్ని ఫార్మాట్లు కలిపి అడిలైడ్‌లో 12 మ్యాచ్‌లు ఆడిన కోహ్లీ 65 సగటుతో 975 పరుగులు చేసి ఐదు శతకాలు బాదాడు. రోహిత్ శర్మ విషయానికి వస్తే, ఈ మైదానంలో అతడి రికార్డు సాధారణంగా ఉంది — ఆరు వన్డేల్లో 21.83 సగటుతో కేవలం 131 పరుగులు మాత్రమే సాధించాడు.
పెర్త్‌లో జరిగిన తొలి మ్యాచ్‌లో రోహిత్ 8 పరుగులకే వెనుదిరగ్గా, కోహ్లీ ఎనిమిది బంతులు ఆడి డకౌట్‌గా వెనుదిరిగాడు. అయితే దీనిపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదని భారత క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్ తెలిపారు. “ఆస్ట్రేలియాలో అత్యంత బౌన్స్ ఉన్న పిచ్‌పై ఆడటం సులభం కాదు. చాలా నెలల తర్వాత అంతర్జాతీయ క్రికెట్ ఆడుతున్న వారికిది కఠిన పరీక్ష. శుభ్‌మన్ గిల్, శ్రేయస్ అయ్యర్ వంటి రెగ్యులర్ ఆటగాళ్లకే కష్టమైంది,” అని ఆయన చెప్పారు.
“భారత జట్టు ఇప్పటికీ చాలా పటిష్టంగా ఉంది. వారు చాంపియన్స్ ట్రోఫీ గెలిచారు. రాబోయే రెండు మ్యాచ్‌ల్లో రోహిత్, కోహ్లీ భారీ స్కోర్లు చేస్తే ఆశ్చర్యం లేదు. వారు నెట్స్‌లో ఎక్కువ సమయం గడిపితే త్వరగా ఫామ్‌లోకి వస్తారు. వారు లయ అందుకుంటే, భారత జట్టు స్కోరు సులభంగా 300 పరుగులు దాటుతుంది,” అని గవాస్కర్ ధీమా వ్యక్తం చేశారు.