ఏపీలో ప్రతి కుటుంబానికి ఆరోగ్య బీమా అందించేందుకు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. సార్వత్రిక ఆరోగ్య బీమా (యూనివర్సల్ హెల్త్ పాలసీ) అమలులో భాగంగా ఇన్సూరెన్స్ కంపెనీ ఎంపిక కోసం టెండర్ల ప్రక్రియకు ఆమోదం తెలిపింది. ఇందుకు సంబంధించిన డ్రాఫ్ట్ ఆర్‌ఎఫ్‌పీ (ప్రతిపాదనల అభ్యర్థన), డ్రాఫ్ట్ కాంట్రాక్ట్ అగ్రిమెంట్ (డీసీఏ)లను ఆమోదించింది.
ఈ టెండర్లను ఆహ్వానించేందుకు ఏపీఎంఎంఎస్‌ఐడీసీకి పూర్తి అధికారాలు ఇచ్చారు. ఇప్పటికే మంత్రివర్గం ఆమోదం తెలిపిన ఈ పథకం తాజా నిర్ణయంతో అమలుకు చేరువైంది.
ప్రభుత్వం నిర్ణయం ప్రకారం, రూ.5 లక్షల లోపు ఆదాయం కలిగిన కుటుంబాలు బీపీఎల్‌గా పరిగణించబడతాయి. వీరికి రూ.2.50 లక్షల వరకు వైద్యం ఇన్సూరెన్స్ కంపెనీ భరిస్తుంది. ఒకవేళ ఖర్చులు ఈ పరిమితిని మించితే, రూ.25 లక్షల వరకు ఎన్టీఆర్ వైద్య సేవ ట్రస్ట్ భరిస్తుంది.
ఏపీఎల్ కుటుంబాలకు కూడా రూ.2.50 లక్షల వరకు ఉచిత వైద్యం లభించనుంది. ఈ నిర్ణయంతో రాష్ట్రంలోని ప్రతి ఒక్కరికీ నాణ్యమైన ఆరోగ్య సేవలు అందుబాటులోకి రానున్నాయి.