బుధ, గురువారాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించడంతో పాఠశాల విద్యాశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. వరంగల్, హనుమకొండ, జనగామ, మహబూబాబాద్, యాదాద్రి భువనగిరి జిల్లాల్లో ఇవాళ, రేపు అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలకు సెలవులు ప్రకటించింది.
గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో ఈ రెండు రోజులు ఒంటిపూట బడులు నిర్వహించాలని ఆదేశించారు. ఈ మేరకు మంగళవారం రాత్రి పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ నవీన్ నికోలస్ ఉత్తర్వులు జారీ చేశారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మూడు రోజుల పాటు అన్ని శాఖల ఉద్యోగుల సెలవులను రద్దు చేయాలని ఆదేశించారు. హైదరాబాద్ కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్‌లో సమీక్ష నిర్వహించి, అకస్మిక వరదలు వస్తే హెలికాప్టర్లను సిద్ధంగా ఉంచాలని సూచించారు. హైదరాబాద్‌లో హైడ్రా అలర్ట్ జారీ చేయడంతో పాటు ఐటీ ఉద్యోగులు వర్క్ ఫ్రమ్ హోం చేయాలన్న సూచనలు చేశారు.