హైదరాబాద్ మహానగరాన్ని భారీ వర్షాలు ముంచెత్తాయి. శుక్రవారం రాత్రి కురిసిన కుండపోత వానకు నగరం అస్తవ్యస్తంగా మారింది. ముఖ్యంగా జంట జలాశయాల గేట్లు ఎత్తడంతో ఉగ్రరూపం దాల్చిన మూసీ నది ఎంజీబీఎస్ బస్టాండ్‌లోకి చేరి వందలాది మంది ప్రయాణికులను చిక్కుల్లో పడేసింది. ఒక్కసారిగా పెరిగిన వరద ప్రవాహంతో బస్టాండ్‌లో మహిళలు, పిల్లలు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు.
ఈ విషయం తెలుసుకున్న సీఎం రేవంత్ రెడ్డి అర్ధరాత్రి సమయంలోనే ఉన్నతాధికారులతో పరిస్థితిని సమీక్షించారు. బస్టాండ్‌లో చిక్కుకున్న వారిని సురక్షితంగా బయటకు తీసుకురావాలని పోలీస్, జీహెచ్‌ఎంసీ, జలమండలి అధికారులకు ఆయన ఆదేశాలు జారీ చేశారు. ఇదే సమయంలో చాదర్‌ఘాట్ సమీపంలోని మూసానగర్‌లో సుమారు 200 ఇళ్లు వరద నీటిలో మునిగిపోవడంతో స్థానికులు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని సురక్షిత ప్రాంతాలకు తరలిపోయారు.
లోతట్టు ప్రాంతాల్లో సహాయక చర్యలకు ఎన్డీఆర్‌ఎఫ్, ఎస్డీఆర్‌ఎఫ్ బృందాలు మోహరించాయి. ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని కూడా సీఎం అధికారులను ఆదేశించారు. వరద కారణంగా పంట పొలాలు దెబ్బతిన్నాయి. నగరవాసులు ఆందోళన చెందుతుండగా అధికారులు సహాయక చర్యలను వేగవంతం చేస్తున్నారు.