ప్రధాని నరేంద్ర మోదీ గురువారం కర్నూలు, నంద్యాల జిల్లాల్లో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా రాయలసీమ అభివృద్ధికి ఊతమిచ్చేలా సుమారు రూ.13,429 కోట్ల విలువైన 16 కీలక ప్రాజెక్టులకు ఆయన శంకుస్థాపన చేయనున్నారు. ఓర్వకల్లులో ఏర్పాటు చేయనున్న పారిశ్రామిక స్మార్ట్ సిటీ, డ్రోన్ సిటీ, కొప్పర్తి పారిశ్రామిక పార్క్ వంటివి ఈ ప్రాజెక్టులలో ప్రధానమైనవి.
కర్నూలు నగర శివారులోని నన్నూరు టోల్ ప్లాజా దగ్గర ఏర్పాటు చేసిన 'సూపర్ జీఎస్టీ-సూపర్ సేవింగ్స్' భారీ బహిరంగ సభలో ప్రధాని పాల్గొని ఈ ప్రాజెక్టులకు శ్రీకారం చుడతారు. దేశంలోనే జీఎస్టీ-2.0పై అవగాహన కల్పించేందుకు నిర్వహిస్తున్న తొలి సభ ఇది. ఈ కార్యక్రమానికి సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రి నారా లోకేశ్, కేంద్ర, రాష్ట్ర మంత్రులు, కూటమి నాయకులు హాజరుకానున్నారు.
బహిరంగ సభకు ముందు ప్రధాని మోదీ శ్రీశైలం క్షేత్రాన్ని సందర్శిస్తారు. ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఒకటైన మల్లికార్జున స్వామిని, అష్టాదశ శక్తి పీఠాలలో ఒకటైన భ్రమరాంబికా దేవిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. అనంతరం, పురావస్తు శాఖ ప్రదర్శనలో ఉన్న పురాతన తామ్ర శాసనాలు, రాగి రేకులను ఆయన తిలకిస్తారు.
భద్రతా ఏర్పాట్లను డీజీపీ హరీశ్ కుమార్ గుప్తా స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. నల్లమల అటవీ ప్రాంతంలో కేంద్ర బలగాలతో కూంబింగ్ నిర్వహించబడింది. ఒక్క శ్రీశైలంలోనే 1800 మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేశారు. భద్రతా కారణాల వల్ల గురువారం ఉదయం 6 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు శ్రీశైలానికి రాకపోకలను నిలిపివేస్తున్నట్లు ప్రకటించారు.