ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ తమిళనాడు మధురైలో జరిగిన మురుగన్ భక్తర్గళ్ మానాడు కార్యక్రమంలో పాల్గొన్నారు. మధురై చేరుకున్న పవన్‌కు అక్కడి బీజేపీ నాయకుల నుండి ఘన స్వాగతం లభించింది. అనంతరం ఆయన మధురైలోని ప్రముఖ మురుగన్ ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేశారు.
ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా మాట్లాడిన పవన్ కళ్యాణ్, హిందూ ధర్మం పై గౌరవంతో కూడిన వ్యాఖ్యలు చేశారు. తాను 16 ఏళ్ల వయస్సులో శబరిమల అయ్యప్ప దర్శనానికి వెళ్లిన విషయాన్ని గుర్తు చేసుకున్నారు. చిన్నప్పుడు ఇంట్లో విభూతి వేసుకుని పాఠశాలకు వెళ్తేను అని చెప్పిన పవన్, అన్ని మతాల పట్ల గౌరవం ఉన్నా హిందువుగా ఉండటం గర్వంగా ఉందని అన్నారు.
కార్యక్రమం ముగిసిన అనంతరం పవన్ సోషల్ మీడియా ద్వారా తన అభినందనలు తెలిపారు. మధురై – మీనాక్షి అమ్మవారి పవిత్ర భూమికి, మురుగన్ నేల అయిన తమిళనాడుకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. ఈ భూమి ధార్మిక భారత్‌కు ప్రాతినిధ్యం వహిస్తుందంటూ పవన్ ప్రశంసలు కురిపించారు. మానాడు లో పాల్గొన్న ప్రతి భక్తునికి, మత గురువులకు, బీజేపీ ప్రముఖులకు, మరియు నిర్వాహకులకు ఆయన ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఆయన చేసిన ట్వీట్, ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.