ఉపాధ్యాయ ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న నిరుద్యోగుల ఆశలెందుకు తెరపడింది. రాష్ట్ర చరిత్రలోనే అపూర్వమైన వేగంతో, కేవలం 150 రోజుల్లో మెగా డీఎస్సీ ప్రక్రియను పూర్తి చేసిన ప్రభుత్వం, ఎంపికైన 15,941 మంది అభ్యర్థులకు గురువారం నియామక పత్రాలను అందజేస్తోంది. అమరావతిలోని సచివాలయం సమీపంలో ఘనంగా ఏర్పాట్లు చేశారు. రాష్ట్రంలో కొత్త ఉపాధ్యాయులతో కొలువుల పండుగ వాతావరణం నెలకొంది.
సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ చేతుల మీదుగా నియామక పత్రాలు పంపిణీ జరగనుంది. ప్రత్యేకంగా టాపర్ అభ్యర్థులకు వేదికపై పత్రాలు అందజేసి, మిగతా అభ్యర్థులకు కౌంటర్ల ద్వారా నియామక ఉత్తర్వులు ఇస్తారు. ఎంపికైన అభ్యర్థుల కుటుంబ సభ్యులు కూడా హాజరు కావచ్చునని అంచనా.
ఈ మెగా డీఎస్సీ ప్రక్రియ ఏప్రిల్ 20న 16,341 పోస్టుల నోటిఫికేషన్ విడుదలైన తర్వాత కేవలం 150 రోజుల్లో రికార్డు వేగంతో పూర్తయ్యింది. 3,36,300 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసి, జూన్ 6 నుంచి జులై 2 వరకు పరీక్షలు నిర్వహించారు. ఈ డీఎస్సీలో తొలిసారిగా ఎస్సీ వర్గీకరణ, హారిజంటల్ రిజర్వేషన్ అమలు చేశారు. ఎంపికైన అభ్యర్థులలో 50.1% పురుషులు, 49.9% మహిళలు ఉన్నారు.