69 అడుగుల శ్రీ విశ్వశాంతి మహాశక్తి గణపతి సిద్ధం
హైదరాబాద్‌లోని ప్రసిద్ధ ఖైరతాబాద్ గణేశ్ ఈ ఏడాది 69 అడుగుల శ్రీ విశ్వశాంతి మహాశక్తి గణపతి రూపంలో భక్తుల దర్శనానికి సిద్ధమయ్యారు. ప్రతి సంవత్సరం జరిగే ఈ భారీ విగ్రహం, విశేష అలంకరణలతో కూడిన ఉత్సవాలను చూడటానికి లక్షలాది మంది భక్తులు ఉభయ తెలుగు రాష్ట్రాలనుంచి తరలివస్తారు.
నేత్రావిష్కరణ కార్యక్రమం
విగ్రహ నిర్మాణంలో చివరి దశ అయిన నేత్రావిష్కరణ కార్యక్రమం నిన్న ఘనంగా జరిగింది. ప్రముఖ శిల్పి రాజేందర్ గణపతికి నేత్రాలు గీశారు. “ప్రాణ ప్రతిష్ఠ”కు ముందు జరిగే ఈ నేత్రావిష్కరణను ఎంతో పవిత్రమైన కర్మగా పరిగణిస్తారు.
బడా గణేశ్ ఆగమన్ సంబరాలు
నేత్రావిష్కరణ అనంతరం ‘బడా గణేశ్ ఆగమన్’ కార్యక్రమాన్ని విశేషంగా నిర్వహించారు. డీజే బీట్స్, మరాఠీ బ్యాండ్, సంప్రదాయ డోలు, తాళాల వాయిద్యాలతో గణపతికి ఘన స్వాగతం పలికారు. యువత నృత్యాలతో పాల్గొని ఉత్సాహాన్ని నింపగా, వీధులన్నీ భక్తుల సందడితో మారుమోగాయి.