వైభవంగా ప్రారంభమైన ఖైరతాబాద్ మహాగణపతి శోభాయాత్ర
శనివారం ఉదయం ఖైరతాబాద్ మహాగణపతి శోభాయాత్ర అంగరంగ వైభవంగా ప్రారంభమైంది. పది రోజుల పాటు భక్తుల పూజలందుకున్న శ్రీ విశ్వశాంతి మహాశక్తి గణపతి 69 అడుగుల ఎత్తు, 50 టన్నుల బరువుతో తన చివరి యాత్రగా హుస్సేన్ సాగర్ వైపు బయలుదేరాడు. ఉదయం 6 గంటలకు ప్రారంభమవ్వాల్సిన ఊరేగింపు కొద్దిపాటి ఆలస్యంతో గణనాథుడిని ప్రత్యేక వాహనంపైకి ఎక్కించి ప్రారంభించారు.
100 టన్నుల బరువును మోయగల సామర్థ్యం ఉన్న ఎస్టీసీ ట్రాన్స్‌పోర్టుకు చెందిన 26 టైర్ల భారీ వాహనాన్ని గణపతి విగ్రహ రవాణాకు వినియోగిస్తున్నారు. గణపతితో పాటు జగన్నాథ స్వామి, లలితా త్రిపుర సుందరి, లక్ష్మీ హయగ్రీవ స్వామి, గజ్జలమ్మ దేవత విగ్రహాలను కూడా మరో వాహనంపై తీసుకువెళ్తున్నారు.
హుస్సేన్ సాగర్ పరిసరాల్లో జీహెచ్ఎంసీ అధికారులు 20 క్రేన్లతో నిమజ్జన ఏర్పాట్లు చేశారు. మధ్యాహ్నం 2 గంటలకు ఎన్టీఆర్ మార్గ్‌లోని నాలుగో నంబర్ క్రేన్ వద్ద మహాగణపతి నిమజ్జనం జరగనుంది. వాటిలో భారీ బరువులను మోయగల “బాహుబలి క్రేన్” ఉండటం ప్రత్యేకత.
ఖైరతాబాద్ నుంచి ప్రారంభమైన ఈ శోభాయాత్ర రాజ్‌దూత్ చౌరస్తా, టెలిఫోన్ భవన్, ఇక్బాల్ మినార్, తెలుగుతల్లి ఫ్లైఓవర్ మీదుగా సచివాలయం ముందు నుంచి ఎన్టీఆర్ మార్గ్ చేరుకుంటుంది. అక్కడ ఏర్పాటు చేసిన క్రేన్ సహాయంతో మహాగణపతి నిమజ్జన కార్యక్రమాన్ని పూర్తి చేస్తారు.