కాళేశ్వరం పూర్తయితే అప్పులపై వడ్డీ తగ్గింపు పరిశీలనలో – కేంద్రం
కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తైన తర్వాత, ఆ ప్రాజెక్టుపై ఉన్న అప్పులపై వడ్డీ తగ్గించే అంశాన్ని పరిశీలిస్తామని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. అయితే అప్పుల చెల్లింపులను మళ్లీ షెడ్యూల్ చేస్తే లేదా పునర్వ్యవస్థీకరిస్తే, ఆర్బీఐ నిబంధనల ప్రకారం ఆ ప్రాజెక్టు ఖాతా స్టాండర్డ్ నుంచి సబ్‌స్టాండర్డ్‌కి మారుతుందని కేంద్ర ఆర్థిక శాఖ వెల్లడించింది.
తెలంగాణ కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి లొక్‌సభలో అడిగిన ప్రశ్నకు కేంద్ర ఆర్థిక సహాయ మంత్రి పంకజ్ చౌదరి లిఖితపూర్వకంగా సమాధానం ఇచ్చారు. తెలంగాణ ప్రభుత్వంనుంచి కాళేశ్వరం ప్రాజెక్టు అప్పుల పునర్వ్యవస్థీకరణ కోసం కేంద్రానికి అభ్యర్థనలు వచ్చాయని తెలిపారు.
ఈ ప్రాజెక్టుకు పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ (PFC) మరియు రూరల్ ఎలక్ట్రిఫికేషన్ కార్పొరేషన్ (REC) సంస్థలు అప్పులు ఇచ్చాయని చెప్పారు. ఇవి నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ సంస్థలు, వీటికి వచ్చే ఖర్చుల ఆధారంగా వడ్డీ రేట్లు నిర్ణయించబడతాయి. ప్రాజెక్టు పూర్తయ్యే గడువును ఇప్పటికే 2024 డిసెంబర్ వరకు పొడిగించామనీ, పూర్తి అయిన తర్వాతే వడ్డీ రేట్లపై నిర్ణయం తీసుకుంటామని తెలిపారు.