సుపరిపాలనలో తొలి అడుగు పేరుతో అమరావతిలో బహిరంగ సభ
ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఈ నెల 12వ తేదీతో ఒక సంవత్సరం పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా అమరావతి రాజధానిలో నేడు “సుపరిపాలనలో తొలి అడుగు” పేరుతో బహిరంగ సభ నిర్వహించనున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది.
మొదట ఈ బహిరంగ సభను 12వ తేదీన నిర్వహించే యోచన ఉండగా, గుజరాత్‌లో జరిగిన ఘోర విమాన ప్రమాదం కారణంగా ఈ కార్యక్రమాన్ని ఈ రోజు వాయిదా వేసారు.
ఈ కార్యక్రమానికి రాష్ట్ర సచివాలయం వెనుక భాగంలో వేదిక సిద్ధం చేశారు. సాయంత్రం 5 గంటలకు ప్రారంభమయ్యే ఈ సభలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ప్రసంగిస్తారు. ఈ ఏడాది కాలంలో ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాలు, అభివృద్ధి పనులు, అలాగే రాబోయే నాలుగేళ్లలో చేపట్టనున్న ప్రాజెక్టుల వివరాలు ఇస్తారు.
సమాచారం ప్రకారం, ఈ సభలో ముఖ్యమంత్రి వివిధ శాఖల మంత్రులను వారి పనితీరుపై ప్రశ్నిస్తూ సమాధానాలు పొందనున్నాడు. కూటమి నేతలు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఇతర ప్రజా ప్రతినిధులు, ముఖ్య కార్యదర్శి, హెడ్ ఆఫ్ డిపార్ట్మెంట్లు, సెక్రటరీలు, జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు కూడా ఈ సభకు హాజరుకానున్నారు.
అమరావతిలో బహిరంగ సభ నిర్వహణకు సంబంధించిన ఏర్పాట్లు ఇప్పటికే పూర్తయ్యాయి.