ప్రజలపై అధిక వైద్య ఖర్చుల భారం తగ్గించాలంటే ఆరోగ్య పరిరక్షణపై అవగాహన పెరగాల్సిన అవసరం ఉందని సీఎం నారా చంద్రబాబు నాయుడు అన్నారు. అవసరం లేకపోయినా సిజేరియన్ డెలివరీలు చేయడం సరికాదని, సాధారణ ప్రసవాలను ప్రోత్సహించాలని సూచించారు. ప్రజలకు మెరుగైన వైద్య సేవలందించడమే కాకుండా, వారు వ్యాధుల బారిన పడకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకునేలా ప్రణాళికాబద్ధంగా పనిచేయాలని అధికారులను ఆదేశించారు.
సచివాలయంలో వైద్య ఆరోగ్య శాఖపై సమీక్ష సమావేశాన్ని నిర్వహించిన సీఎం చంద్రబాబు, భవిష్యత్తులో వైద్య ఖర్చులు ప్రజలకు భరించలేని భారంగా మారే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజల ఆరోగ్యంపై అవగాహన కల్పించడంతో పాటు ఆహారపు అలవాట్లలో మార్పులు అవసరమని తెలిపారు. ప్రస్తుతం ప్రజల ఆహారపు అలవాట్లు మారకపోతే క్యాన్సర్ వంటి ప్రాణాంతక రోగాలు వచ్చే ప్రమాదం ఉందని, ఆర్గానిక్ ఉత్పత్తుల వినియోగం పెంచాలని సూచించారు. దీనికి సంబంధించిన చైతన్యాన్ని రైతులు మరియు ప్రజల్లో కల్పించాలని తెలిపారు.
ప్రతి నియోజకవర్గంలో 100 పడకల ఆస్పత్రి ఉండేలా చర్యలు తీసుకోవాలని, గిరిజన ప్రాంతాల్లో వైద్య సౌకర్యాలు మెరుగుపర్చాలని సీఎం స్పష్టం చేశారు. ప్రభుత్వ ఆస్పత్రులను ప్రైవేట్ ఆస్పత్రులకు ధీటుగా తీర్చిదిద్దాలన్నారు. అవసరమైతే ఔట్‌సోర్సింగ్ సేవలు తీసుకోవచ్చని, మెడికల్ కాలేజీల నిర్మాణాన్ని వేగవంతం చేయాలని ఆదేశించారు. రాష్ట్రంలో డీమ్డ్ యూనివర్సిటీల ఏర్పాటుపై దృష్టి సారించాల్సిన అవసరం ఉందన్నారు. మంత్రి సత్యకుమార్ యాదవ్, ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్రివెంటివ్ మెడిసిన్ డైరెక్టరేట్‌లో 723 పోస్టుల్లో కేవలం 143 మంది మాత్రమే ఉన్నారని తెలియజేయడంతో, ముందు దశలో 150 పోస్టులను భర్తీ చేయాలని సీఎం ఆమోదం తెలిపారు.