ఏపీలో 20 లక్షల ఉద్యోగాల లక్ష్యంతో నైపుణ్య శిక్షణ – సీఎం చంద్రబాబు
ఆంధ్రప్రదేశ్ సీఎం నారా చంద్రబాబు నాయుడు రాష్ట్రంలో 20 లక్షల ఉద్యోగాల కల్పన ప్రధాన లక్ష్యంగా ప్రభుత్వం పని చేస్తుందని తెలిపారు. ఈ దిశగా నైపుణ్య శిక్షణ కల్పించి, నైపుణ్యం పోర్టల్ ద్వారా ఉద్యోగ అవకాశాలను యువతతో అనుసంధానం చేయాలని అధికారులకు సూచించారు. సచివాలయంలో నైపుణ్యాభివృద్ధి శాఖపై సమీక్ష నిర్వహించిన ఆయన, AI (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్) సాయంతో దేశంలోనే కాదు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఉద్యోగ అవకాశాలను పోర్టల్‌లో పొందుపరచాలని ఆదేశించారు.
యువత పోర్టల్‌లో నమోదు చేసుకున్న వెంటనే ఆటోమేటిక్‌గా వారి రెజ్యూమే తయారవ్వాలి అని, వారికి ఉద్యోగ సమాచారం ఎప్పటికప్పుడు చేరేలా చూడాలన్నారు. ఇప్పటికే రాష్ట్రం రూ. 9.5 లక్షల కోట్ల పెట్టుబడులకు ఒప్పందాలు చేసిందని, వీటి ద్వారా 8.5 లక్షల ఉద్యోగాలు వచ్చే అవకాశముందని చెప్పారు. ముఖ్యంగా ఐటీ కోర్సులు చేసిన విద్యార్థుల నైపుణ్యాలను అంచనా వేయాలని సూచించారు.
మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి నారా లోకేశ్ ముఖ్యమంత్రి కి నివేదించగా, కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత 175 నియోజకవర్గాల్లో 1,164 జాబ్ మేళాలు నిర్వహించారని, ఇప్పటివరకు 61,991 మందికి ఉద్యోగాలు కల్పించామని తెలిపారు. నైపుణ్యాభివృద్ధి సంస్థ ద్వారా శిక్షణ పొందిన 74,834 మందికి ప్లేస్‌మెంట్లు లభించాయని చెప్పారు. పోర్టల్‌లో రిజిస్ట్రేషన్, శిక్షణ, సర్టిఫికేషన్, ప్లేస్‌మెంట్, పరిశ్రమల అనుసంధానం, విదేశీ భాష శిక్షణ వంటి వివరాలను కూడా అందుబాటులో ఉంచినట్లు తెలిపారు. ప్రతి నియోజకవర్గంలో కనీసం 1,500 ఉద్యోగాలు కల్పించేలా జాబ్ మేళాలు నిర్వహించాలని, అన్ని పరిశ్రమల్లో అప్రెంటీస్‌షిప్ విధానం అమలు చేయాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు.