తెలంగాణ ప్రభుత్వ పాఠశాలల్లో డిజిటల్ విద్యను బలోపేతం చేసే దిశగా రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. దాదాపు రెండు దశాబ్దాల తర్వాత ప్రభుత్వ స్కూళ్లలో ఐసీటీ ఇన్‌స్ట్రక్టర్ల (కంప్యూటర్ టీచర్ల) నియామకానికి ఆమోదం తెలిపింది. ప్రస్తుతం కంప్యూటర్ ల్యాబ్‌లు ఉన్న పాఠశాలల్లో విద్యార్థులకు సాంకేతిక విద్యను అందుబాటులోకి తీసుకురావడమే ఈ నిర్ణయం వెనుక ముఖ్య ఉద్దేశ్యం. రాష్ట్రవ్యాప్తంగా 5 లేదా అంతకంటే ఎక్కువ కంప్యూటర్లు ఉన్న 2,837 పాఠశాలలను అధికారులు గుర్తించారు. ఈ స్కూళ్లలో ఔట్ సోర్సింగ్ విధానంలో టీజీటీఎస్ (తెలంగాణ టెక్నాలజీ సర్వీసెస్) ద్వారా త్వరలోనే బోధకుల నియామక ప్రక్రియ చేపట్టనున్నారు.
ఎంపికైన ఇన్‌స్ట్రక్టర్లకు నెలకు రూ.15,000 గౌరవ వేతనం పది నెలల పాటు సమగ్ర శిక్షా నిధుల ద్వారా చెల్లించనున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కాలంలో సుమారు 20 ఏళ్ల క్రితం 4,200 పాఠశాలల్లో కంప్యూటర్లు ఏర్పాటు చేసి ఇన్‌స్ట్రక్టర్లను నియమించినా, తర్వాత కొనసాగించకపోవడంతో చాలావరకు కంప్యూటర్ ల్యాబ్‌లు పనికిరాని స్థితికి చేరాయి. ఇప్పుడు తిరిగి నియమించే బోధకులు ల్యాబ్‌ల నిర్వహణతో పాటు విద్యార్థులకు డిజిటల్ విద్యను అందించడంలో కీలక పాత్ర పోషించనున్నారు.
అంతేకాకుండా, ప్రభుత్వ పాఠశాలల్లో ప్రస్తుతం అమలవుతున్న పలు డిజిటల్ కార్యక్రమాలకు కూడా ఈ నియామకాలు మరింత దోహదపడనున్నాయి. ఎక్‌స్టెప్ ఫౌండేషన్ సహకారంతో 1,354 పాఠశాలల్లో అమలవుతున్న ‘అసిస్టెడ్ లాంగ్వేజ్ అండ్ మ్యాథ్స్ లెర్నింగ్ ప్రోగ్రామ్’, అలాగే ఈ విద్యా సంవత్సరం నుంచి ప్రారంభించిన ‘ఖాన్ అకాడమీ’ ఆన్‌లైన్ తరగతులు సమర్థవంతంగా నడవాలంటే కంప్యూటర్లపై అవగాహన ఉన్న బోధకుల అవసరం చాలా ఉంది. ఈ కొత్త నియామకాలతో ప్రభుత్వ స్కూళ్లలోని కంప్యూటర్ ల్యాబ్‌లు తిరిగి చురుకుదనం సంతరించుకొని డిజిటల్ విద్య బోధనకు కొత్త ఊపు వస్తుందని విద్యాశాఖ ఆశాభావం వ్యక్తం చేస్తోంది.