‘జయ జయహే తెలంగాణ’ గీత రచయిత అందెశ్రీ ఇకలేరు
తెలంగాణ రాష్ట్ర గీతం ‘జయ జయహే తెలంగాణ’ రచయిత, ప్రముఖ కవి అందెశ్రీ (64) కన్నుమూశారు. గత రాత్రి హైదరాబాద్‌లోని తన నివాసంలో తీవ్ర అస్వస్థతకు గురవడంతో కుటుంబ సభ్యులు ఆయనను గాంధీ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ ఆయన తుదిశ్వాస విడిచారు.
అందెశ్రీ రచించిన ‘జయ జయహే తెలంగాణ’ గీతాన్ని తెలంగాణ ప్రభుత్వం రాష్ట్ర గీతంగా గుర్తించింది. ఆయన పాటలు, రచనలు తెలంగాణ ఉద్యమంలో ప్రజల్లో ఉత్సాహాన్ని నింపాయి. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధనలో ఆయన సాహిత్యం ప్రేరణగా నిలిచింది.
పాఠశాల విద్య లేకపోయినా తన సహజ ప్రతిభతోనే కవిగా గొప్ప పేరు తెచ్చుకున్న అందెశ్రీ, ‘మాయమైపోతున్నడమ్మా మనిషన్నవాడు’ పాటతో విస్తృత ప్రజాదరణ పొందారు. ఆయన రచనలు తెలుగు సాహిత్యంలో చిరస్థాయిగా నిలిచిపోయాయి.
ఆయన మరణం తెలుగు సాహిత్య, తెలంగాణ సాంస్కృతిక రంగాలకు తీరని లోటు అని పలువురు ప్రముఖులు, రచయితలు, సాహితీవేత్తలు సంతాపం వ్యక్తం చేశారు.