జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక పోలింగ్ ప్రారంభం – భారీ భద్రతా ఏర్పాట్లు
ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న జూబ్లీహిల్స్ నియోజకవర్గ ఉప ఎన్నిక పోలింగ్ ఈరోజు ఉదయం 7 గంటలకు ప్రారంభమైంది. సాయంత్రం 6 గంటల వరకు ఓటింగ్ కొనసాగనుంది. ఎన్నికల సంఘం అధికారులు పోలింగ్ కోసం పటిష్టమైన ఏర్పాట్లు చేశారు. పోలింగ్ ప్రారంభానికి ముందు ఉదయం 6.30 గంటలకు మాక్ పోలింగ్ నిర్వహించి ఈవీఎంల పనితీరును సరిచూశారు.
ఉప ఎన్నిక సందర్భంగా నియోజకవర్గ వ్యాప్తంగా 144 సెక్షన్ అమల్లో ఉంది. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా భారీ భద్రతా బందోబస్తు ఏర్పాటు చేశారు. సున్నిత ప్రాంతాలను డ్రోన్ల సహాయంతో పర్యవేక్షిస్తున్నారు. పోలింగ్ ప్రక్రియ సజావుగా సాగేందుకు సుమారు 3 వేల మంది పోలింగ్ సిబ్బంది, 2 వేల మంది పోలీసులు విధుల్లో ఉన్నారు. ఎన్నికల నియమావళిని అతిక్రమిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు.
ఈ ఉప ఎన్నికలో మొత్తం 58 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. 4 లక్షల మంది ఓటర్లు, 407 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఇప్పటికే 103 పోస్టల్ బ్యాలెట్ ఓట్లు పోలైనట్లు అధికారులు తెలిపారు.
బీఆర్ఎస్ నేత మాగంటి సునీత నవోదయ కాలనీలోని 290వ పోలింగ్ కేంద్రంలో ఓటు వేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, జూబ్లీహిల్స్ ప్రజలందరూ తప్పనిసరిగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు.