సముద్ర మట్టానికి సగటున 0.9 కిలోమీటర్ల ఎత్తులో ఉపరితల ఆవర్తనం విస్తరించి ఉండటంతో ఉత్తరాంధ్రలో వాతావరణం ఒక్కసారిగా మారింది. ఈ ప్రభావంతో శనివారం (అక్టోబర్ 11) ఉత్తరాంధ్రలోని పలు జిల్లాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ తెలిపారు.
అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, అనకాపల్లి, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే సమయంలో చెట్ల క్రింద నిలబడరాదని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు.
శుక్రవారం సాయంత్రం వరకు నమోదైన వర్షపాతం వివరాల ప్రకారం కోనసీమ జిల్లా నగరంలో 46 మిల్లీమీటర్లు, మలికిపురంలో 36.2 మిల్లీమీటర్లు, ప్రకాశం జిల్లా నర్సింగోలులో 27 మిల్లీమీటర్లు, కాకినాడ జిల్లా డి.పోలవరంలో 25.5 మిల్లీమీటర్లు, కోనసీమ జిల్లా అంబాజీపేటలో 21.7 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు ప్రఖర్ జైన్ వెల్లడించారు.