విశాఖలో లారస్ ల్యాబ్స్ భారీ పెట్టుబడి – రూ.5000 కోట్లతో అత్యాధునిక ఉత్పత్తి యూనిట్
ప్రముఖ ఫార్మా సంస్థ లారస్ ల్యాబ్స్ ఆంధ్రప్రదేశ్‌లో భారీ పెట్టుబడితో ముందుకొచ్చింది. విశాఖపట్నం వద్ద రూ.5000 కోట్ల వ్యయంతో అత్యాధునిక ఉత్పత్తి యూనిట్‌ను ఏర్పాటు చేయనున్నట్లు సంస్థ ప్రకటించింది. ఈ ప్రాజెక్ట్ కోసం రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే 532 ఎకరాల భూమిని కేటాయించింది. రాబోయే ఎనిమిదేళ్లలో దశలవారీగా ప్రాజెక్ట్ పూర్తిచేయాలని కంపెనీ సీఈఓ చావా సత్యనారాయణ వెల్లడించారు.
ఇటీవల జరిగిన ఇన్వెస్టర్స్ కాల్‌లో ఆయన ఈ కీలక వివరాలను వెల్లడించారు. అంతర్జాతీయ ప్రమాణాలతో ఈ యూనిట్‌ను నిర్మించనున్నామని, ప్రాజెక్ట్ అవసరాలను బట్టి భవిష్యత్తులో మరిన్ని పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధంగా ఉన్నట్లు సత్యనారాయణ తెలిపారు.
అంతేకాక, కర్ణాటకలోని మైసూరులో తలపెట్టిన భారీ ఫెర్మెంటేషన్ యూనిట్‌ను కూడా విశాఖకు తరలిస్తున్నట్లు ఆయన ప్రకటించారు. దీంతో అన్ని ప్రధాన కార్యకలాపాలు విశాఖ కేంద్రంగానే జరగనున్నాయి.
ఈ ప్రాజెక్ట్ పూర్తయితే విశాఖపట్నం ఫార్మా రంగంలో ప్రధాన కేంద్రంగా ఎదగనుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. లారస్ ల్యాబ్స్ ప్రస్తుతం హైదరాబాద్, ముంబై, బెంగళూరు, కాన్పూర్‌లలో తయారీ మరియు పరిశోధనా కేంద్రాలు కలిగి ఉంది. సంస్థలో 7,000 మందికిపైగా ఉద్యోగులు ఉన్నారు.