అమరావతి, మే 13: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మెగా డీఎస్సీ 2025 నోటిఫికేషన్ తాజాగా వెలువడింది. రాష్ట్రవ్యాప్తంగా 16,347 ఉపాధ్యాయ ఉద్యోగాల భర్తీకి ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ నడుస్తోంది. వీటిలో జిల్లా స్థాయిలో 14,088, రాష్ట్ర, జోనల్ స్థాయిలో 2,259 పోస్టులు ఉన్నాయి. అయితే, దరఖాస్తు గడువు సమీపిస్తున్న కారణంగా, అభ్యర్ధులు తుది గడువులోపు తమ దరఖాస్తులను సమర్పించమని అధికారులు సూచిస్తున్నారు. మే 15వ తేదీతో దరఖాస్తు గడువు ముగియనుంది. మరోవైపు, జూన్ 6 నుంచి ఆన్‌లైన్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఈ నోటిఫికేషన్ కింద ప్రభుత్వ, జిల్లా, మండల పరిషత్తులు, పురపాలక, గిరిజన ఆశ్రమ పాఠశాలలు, జువెనైల్ సంక్షేమ పాఠశాలలు వంటి విద్యా సంస్థలలో ఖాళీలు భర్తీ చేయబడతాయి. ఎస్జీటీ పోస్టులు 6,599, స్కూల్ అసిస్టెంట్ పోస్టులు 7,487 ఉన్నాయి, అలాగే రాష్ట్ర స్థాయిలో 259 పోస్టులు ఉన్నాయి. జోన్ వారీగా జోన్-1లో 400, జోన్-2లో 348, జోన్-3లో 570, జోన్-4లో 682 పోస్టులు ఉన్నాయి. మొత్తం 13,192 ఖాళీలు ప్రభుత్వ, జిల్లా, మండల పరిషత్తు, పురపాలక పాఠశాలల్లో ఉన్నాయి. గిరిజన ఆశ్రమ పాఠశాలల్లో 881, జువెనైల్ పాఠశాలల్లో 15, బధిరులు, అంధుల పాఠశాలల్లో 31 పోస్టులు ఉన్నాయి.
ఆన్‌లైన్ రాత పరీక్షలు జూన్ 6 నుంచి జూలై 6 వరకు జరగనున్నాయి. హాల్ టికెట్లు మే 30 నుంచి అందుబాటులో ఉంటాయి. ప్రాథమిక కీ చివరి పరీక్ష తర్వాత రెండవ రోజు విడుదల చేస్తారు. కీపై అభ్యంతరాలు 7 రోజులలోపు తెలపవలసి ఉంటుంది. ఆపై, అభ్యంతరాల స్వీకరణ గడువు ముగిసిన తర్వాత తుది కీ విడుదల చేస్తారు. ఫైనల్ కీ తర్వాత 7 రోజులకు మెరిట్ జాబితా విడుదల కానుంది. పిన్సిపల్, పీజీటీ పోస్టులకు 100 మార్కులకు పరీక్ష ఉంటుంది. టీజీటీ, స్కూల్ అసిస్టెంట్, ఎస్జీటీ పోస్టులకు టెట్ వెయిటేజీ 20 శాతం ఉంటుంది.