ఏపీ డీఎస్సీ: వాయిదా వేసిన పరీక్షలు జూలై 1, 2 తేదీల్లో – హాల్ టికెట్లు విడుదల
ఏపీ డీఎస్సీ అభ్యర్థులకు కీలక ప్రకటన వెలువడింది. జులై 1, 2 తేదీల్లో పరీక్షలు రాయనున్న అభ్యర్థులు, అధికారిక వెబ్‌సైట్ apdsc.apcfss.in ద్వారా తమ హాల్ టికెట్లను డౌన్‌లోడ్ చేసుకోవాలని అధికారులు సూచించారు.
గతంలో జూన్ 20, 21 తేదీల్లో నిర్వహించాల్సిన మెగా డీఎస్సీ పరీక్షలు, అంతర్జాతీయ యోగా దినోత్సవం కారణంగా వాయిదా వేశారు. ఇప్పుడు ఆ వాయిదా వేసిన పరీక్షలను జులై 1, 2 తేదీల్లో నిర్వహించనున్నారు.
పరీక్షా కేంద్రాలు మరియు తేదీల్లో మార్పులు చేసినందున, కొత్త హాల్ టికెట్లు విడుదల చేశారు. అభ్యర్థులు తాజా హాల్ టికెట్లలో పరీక్ష కేంద్రం మరియు తేదీని ఖచ్చితంగా నిర్ధారించుకుని పరీక్షకు హాజరు కావాలని అధికారులు కోరుతున్నారు.
ఇదిలా ఉండగా, ఆదివారం జరిగిన ప్రిన్సిపల్ మరియు స్కూల్ అసిస్టెంట్ (తెలుగు) పరీక్షలకు మొత్తం 19,750 మంది అభ్యర్థులలో 18,231 మంది హాజరయ్యారు. ఇందులో చిత్తూరు జిల్లాలో 97.81 శాతం, నెల్లూరు జిల్లాలో 88.04 శాతం అత్యధిక హాజరు నమోదైనట్టు అధికారులు తెలిపారు.