రాష్ట్రంలో ఉపాధ్యాయ నియామకాల ప్రక్రియను వేగవంతం చేసేందుకు పాఠశాల విద్యాశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రతి సారి డీఎస్సీ నోటిఫికేషన్‌కు అడ్డంకిగా మారుతున్న న్యాయ వివాదాలకు ఈసారి ఫుల్‌స్టాప్ పెట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ క్రమంలో, త్వరలో నిర్వహించబోయే ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) నిబంధనల్లో కీలక మార్పులు చేయనుంది. ఇకపై టెట్ అర్హతలను పూర్తిగా జాతీయ ఉపాధ్యాయ విద్య మండలి (ఎన్‌సీటీఈ) మార్గదర్శకాలకు అనుగుణంగా అమలు చేయాలని నిర్ణయం తీసుకుంది.
గతంలో డీఎస్సీ నోటిఫికేషన్లు విడుదలైన ప్రతిసారీ అభ్యర్థుల అర్హతలు, డిగ్రీ మార్కులు వంటి అంశాలపై కోర్టు కేసులు నమోదవడం వల్ల నియామక ప్రక్రియ ఆలస్యమైంది. ఈ సమస్యను అధిగమించేందుకు, ఈసారి టెట్ నోటిఫికేషన్ నుంచే ఎన్‌సీటీఈ నిబంధనలను కచ్చితంగా పాటించనున్నారు. దీంతో భవిష్యత్తులో ఎలాంటి న్యాయపరమైన చిక్కులు తలెత్తకుండా నియామక ప్రక్రియ సజావుగా సాగుతుందని విద్యాశాఖ ఆశిస్తోంది.
రాష్ట్ర ఐటీ, మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి నారా లోకేశ్ ఇప్పటికే ప్రకటించినట్లుగా, ప్రభుత్వం జనవరిలో డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తోంది. ఈ నోటిఫికేషన్‌లో దాదాపు 2,000 ఉపాధ్యాయ పోస్టులు ఉండే అవకాశం ఉంది. ఇందులో స్పెషల్ డీఎస్సీ కింద 1,000 పోస్టులు, మెగా డీఎస్సీ–2025లో మిగిలిపోయిన 406 పోస్టులు, అలాగే ఈ ఏడాది పదవీ విరమణ చేసిన ఉపాధ్యాయుల ఖాళీలు కూడా కలపనున్నారు. పోస్టుల భర్తీలో విద్యార్థుల సంఖ్యను కూడా పరిగణనలోకి తీసుకోనున్నారు.
ఈసారి పూర్తిగా పక్కా ప్రణాళికతో డీఎస్సీ నిర్వహణకు విద్యాశాఖ సిద్ధమవుతుండగా, అభ్యర్థుల్లో కొత్త ఉత్సాహం నెలకొంది.